డీఎస్‌వో ఉదయ్ భాస్కర్
ముమ్మిడివరం: రబీలో ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ సూచించారు. శుక్రవారం ఆయన స్థానిక ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి, టెక్నికల్ అసిస్టెంట్లు, సంబంధిత అధికారులకు ధాన్యం కొనుగోళ్లపై శిక్షణ ఇచ్చారు. ఆన్‌లైన్ పోర్టర్ వినియోగం, రైతుల వివరాల నమోదు, ఈకేవైసీ ప్రక్రియలో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు. కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ములు 24 గంటల లోనే రైతుల ఖాతాలలోకి జమచేయడం జరుగుతుందన్నారు. జిల్లా ఫౌర సరఫరాల మేనేజర్ పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
26 నుంచి క్రీడా
అకాడమీల ప్రారంభం
అమలాపురం రూరల్: విజయవాడ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి విశాఖ, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో రాష్ట్ర క్రీడా అకాడమీల పునఃస్థాపన ప్రక్రియను ప్రారంభించినట్టు కోనసీమ క్రీడా ప్రాధికార సంస్థ అధికారి వైవీ రుద్ర తెలిపారు. రాష్ట్‌ట్ర క్రీడాకారుల అభివృద్ధికి పటిష్ట వ్యవస్థ ఏర్పాటు దిశగా ముఖ్యమైన ముందడుగని అన్నారు. 15 ఏళ్లు పైబడి 19 ఏళ్ల లోపు వయసు గల క్రీడాకారులు జనవరి ఒకటి, 2008 నుంచి జనవరి ఒకటి, 2011 మధ్య జన్మించిన వారు ఈ ఎంపికలకు అర్హులని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ ఆధారిత ఎంపిక ప్రక్రియ ద్వారా వివిధ క్రీడా విభాగాలలో ప్రవేశాలు కల్పించనున్నట్టు తెలిపారు.
13న మినీ ఉద్యోగ మేళా
అమలాపురం రూరల్: ఈ నెల 13వ తేదీ సోమవారం కలెక్టరేట్ వికాస కార్యాలయంలో మినీ ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. తమిళనాడులోని హోసూర్‌లోని టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఇంటర్వ్యూలు సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని 19–35 ఏళ్ల మధ్య ఉన్న మహిళా అభ్యర్థులు ఇంటర్, డిగ్రీ, బీటెక్ పీజీ పూర్తి చేసిన వారు తమ బయోడేటాతో హాజరు కావాలని వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ తెలిపారు. ఇంటర్వ్యూలు పూర్తయిన వెంటనే ఎంపికై న అభ్యర్థులకు జాయినింగ్ ఆర్డర్లు ఇస్తామని తెలిపారు.
సిబ్బంది సమస్యలపై
‘ఎస్పీ సంపర్క్’
అమలాపురం టౌన్: పోలీస్ సిబ్బంది బదిలీలు, సెలవులు, ఆరోగ్య సమస్యలు, ఇతర సర్వీస్ సమస్యలపై జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ‘ఎస్పీ సంపర్క్’ను శుక్రవారం నిర్వహించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పోలీసులు కొందరు నేరుగా, మరికొందరు ఫోన్ల ద్వారా ఎస్పీతో తమ సమస్యలను చెప్పుకొన్నారు. సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకూ ఈ కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో ఒత్తిళ్లను అధిగమించేందుకు సిబ్బంది సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ కార్యాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మూల్యాంకనం త్వరగా పూర్తిచేయాలి
ఆర్జేడీ నాగమణి
అమలాపురం టౌన్: పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా నిర్దేశిత సమయంలోనే త్వరగ పూర్తి చేయాలని విద్యా శాఖ ఆర్జేడీ నాగమణి సూచించారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ఉపాధ్యాయులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. డీఈవో పి. నాగేశ్వరరావు, అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట డీవైఈవోలు జి.సూర్య ప్రకాశం, లక్ష్మణమూర్తి, కె.వెంకటేశ్వరరావు, డీసీఈబీ సెక్రటరీ బీర హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.


