● కొన్నిచోట్ల స్వల్ప వివాదాలు..
పోలీసుల రంగ ప్రవేశం
● బూత్‌ల వద్ద బారులు తీరిన ఓటర్లు
● ఓటుహక్కు వినియోగించుకున్న
35,445 మంది
● పురుషులు 17,311,
మహిళలు 18,134 మంది
● ఓటు వేసిన సిటింగ్ ఎమ్మెల్యే అశోక్,
మల్లాడి, తోటరాజు
యానాం: యానాం శాసనసభా నియోజకవర్గానికి గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద స్వల్ప వివాదాలు తలెత్తాయి. దీంతో పోలీసు బలగాలు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఉదయం 8 గంటల నుంచే పలు పోలింగ్ బూత్‌ల వద్ద ఓటుహక్కు వినియోగించుకోవడానికి జనం బారులు తీరారు. మొత్తం నియోజకవర్గ పరిధిలో 37,972 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 42 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మహిళల కోసం ఎంజీజీబీ హైస్కూల్‌లో పింక్ పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు.
పోలింగ్ సరళి
నియోజకవర్గ పరిధిలో 42 పోలింగ్ బూత్‌లలో ఉదయం 9 గంటలకు 16.6శాతంతో 6,032 ఓట్లు, 11 గంటలకు 36.4 శాతంతో 13,998 ఓట్లు నమోదు కాగా, మధ్యాహ్నం 1 గంటకు 57.12 శాతంతో 21,689 ఓట్లు, 3 గంటలకు 74.63 శాతంతో 28,338 ఓట్లు, సాయంత్రం 5 గంటలకు 89.80 శాతంతో 34,098 ఓట్లు పోలయ్యాయి.
పరిశీలించిన అబ్జర్వర్‌లు
కనకాలపేట, కురసాంపేట, అయ్యన్ననగర్, దరియాలతిప్ప, దొమ్మేటిపేట, సావిత్రినగర్, గిరియాంపేట, తదితర ప్రాంతాల్లో ఓటుహక్కు వినియోగించుకోవడానికి మహిళలు, వృద్ధులు, యువతీయువకులు బారులు తీరి నిలబడ్డారు. మెట్టకూరు జవహర్‌లాల్‌నెహ్రూ ప్రభుత్వ హైస్కూల్‌లో యూత్ పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేశారు. వృద్ధులకు కోసం వీల్‌చైర్‌లను ఏర్పాటు చేయగా ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు వారిని పోలింగ్‌బూత్‌ల వద్దకు తీసుకువచ్చి ఓటు వేసేందుకు సహకరించారు. పోలింగ్‌బూత్‌లను పోలీస్ అబ్జర్వర్, జనరల్ అబ్జర్వర్‌లు రాజస్థాన్ ఐజీ ప్రీతిచంద్ర తదితరులు పరిశీలించారు.
ఓటుహక్కు వినియోగించుకున్న అభ్యర్థులు
శాసనసభా నియోజకవర్గ స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. స్థానిక వెటర్నరీ ఆసుపత్రి వద్ద ఉన్న పోలింగ్ బూత్‌లో సిటింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీమంత్రి మల్లాడి కృష్ణారావు, జకీర్‌హుస్సేన్ స్కూల్ బూత్ వద్ద టీవీకే అభ్యర్థి తోటరాజు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు గిడ్డి బలరాం, మెల్లం శ్రీనివాసరావు, నాటి బూరియ్య, తిరుకోటి ఆదిమూర్తి, గొల్లపల్లి లక్ష్మీస్నేహ, మల్లాడి ఉదయలక్ష్మి, సూరిమిల్లి సుబ్బారావు, జనిపల్లి వెంకన్నబాబు, కాళ్ల వెంకటరత్నం, షేక్ అహ్మద్‌షా ఖాదర్ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కురసాంపేట, మెట్టకూరు, వంశీకృష్ణ కాలనీల్లో స్వల్ప వివాదం తలెత్తింది. మల్లాడి, అశోక్ వర్గీయుల మధ్య వివాదం తలెత్తడంతో పోలీసు బలగాలు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది.
కనకాలపేట పోలింగ్ బూత్‌లో బారులు తీరిన ఓటర్లు
విజయంపై ఎవరి ధీమా వారిది!
అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కావడంతో అది ఎవరి గెలుపునకు దోహద పడుతుందో అని జనంలో తర్జనభర్జన జరుగుతోంది. పట్టణంలో ఎక్కువ మంది ఓటు వేయడం, కనకాలపేట, తీర గ్రామాలైన సావిత్రినగర్, గిరియాంపేట, అయ్యన్ననగర్‌ల్లో అధిక ఓటుశాతం నమోదు తదితర పరిణామాల మధ్య అభ్యర్థుల మద్దతుదారులు విజయంపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు.


