
మాజీ ఎంపీ చింతా అనురాధ
అల్లవరం: పులివెందులలో ఈ నెల 12న జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే వైఎస్సార్ సీసీ శ్రేణులపై దాడులకు తెగబడుతుందన్నారు. పార్టీ సానుభూతిపరుల ఆస్తులు, వాహనాలను ధ్వంసం చేస్తూ అరాచకాలు చేస్తుందని అనురాధ ఆరోపించారు.
కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు పోలీసులను అధికార దుర్వినియోగానికి వాడుకుంటూ, ఎన్నికల కమిషన్‌ను ప్రభావితం చేసి పోలింగ్ కేంద్రాలను ఉన్న పళంగా మార్చేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను తుంగల్లో తొక్కి ప్రజలను మోసం చేసిందన్నారు. పులివెందుల ప్రజలు మేల్కొని కూటమి అభ్యర్థిని జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడించాలని ఆమె కోరారు.