
సాక్షి, విశాఖ: నేడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదు.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ నాయకులు. పులివెందులలో పోలీసులు, వైఎస్సార్‌సీపీ మధ్య ఎన్నికలు జరిగాయని అన్నారు. కూటమి సర్కార్‌ను గద్దె దింపే వరకు ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.
విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో విస్తృతస్తాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు హాజరయ్యారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంభ రవిబాబు.. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘ప్రతీ రోజూ జగన్‌ను దళితులు తలుచుకుంటారు. దళితుల పక్షపాతి వైఎస్ జగన్. 20శాతం మంత్రి పదవులు దళితులకు జగన్ ఇచ్చారు. దళితులకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారు. దళితులకు ఏ పథకాలు రావడం లేదు. దళితులను కూటమి ప్రభుత్వం మోసం చేసింది. మోసానికి ప్యాంటు షర్టు వేస్తే చంద్రబాబు. మోసానికి మరో పేరు చంద్రబాబు. ఎస్సీలు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ క్యాస్ట్ అని జగన్ నమ్మారు. సామాజిక న్యాయ మహా శిల్పాన్ని బాబు, లోకేష్, పవన్ ఒక్కసారైనా సందర్శించారా?. టీడీపీ గూండాలతో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశారు. సూర్య చంద్రులు ఏకమైనా వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఆపలేరు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్. నేడు రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలులో లేదు. గడిచిన ఎన్నికల్లో అన్ని కులాల కంటే వైఎస్సార్‌సీపీకి దళితులు అధికంగా ఓటేశారు. దళితులకు జగన్ అన్ని విధాలుగా న్యాయం చేశారు..
టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ..‘దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నాడు. మిమ్మల్ని గద్దె దింపే వరకూ నిద్రపోయేది లేదు. డౌన్.. డౌన్ చంద్రబాబు అనే నినాదాలు ఊరు.. వాడా మొగాలి. చంద్రబాబు ఇంకా వెయ్యి రోజులే ముఖ్యమంత్రిగా ఉంటారు. పోలీసులకు, వైఎస్సార్‌సీపీకి మధ్య పులివెందుల ఎన్నిక జరిగింది. దళితుల ఆత్మగౌరవాన్ని 175 అడుగుల ఎత్తులో జగన్ నిలబెట్టారు. తెల్లవారింది మొదలు జగన్ గెలుపు కోసం పని చేస్తాం అని అన్నారు.