
అనకాపల్లి: ఏపీలో రైతులకు యూరియా ఇవ్వడం సహా వారి కష్టాలు తీర్చడంతో కూటమి సర్కార్ విఫలమైందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల ఇబ్బందులపై ఈనెల తొమ్మిదో తేదీన వైఎస్సార్‌సీపీ పోరుబాట కార్యక్రమం చేపడుతున్నట్టు తెలిపారు. అన్ని ఆర్డీవో కార్యాలయాలకు పార్టీ నేతలు వెళ్లి వినతి పత్రం సమర్పించనున్నట్టు చెప్పారు.
అనకాపల్లి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుడూ..‘సైన్స్ కన్నా ముందు వ్యవసాయమే విజ్ఞానమని రైతు చాటి చెప్పాడు. అలాంటి రైతులు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రైతులకు విత్తనం, ఎరువులు అందలేదనే మాట ఎప్పుడూ లేదు. రైతులకు ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం పని చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాం. 15వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను వైఎస్ జగన్ తీసుకొచ్చారు. రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయి.
వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. రైతుల కోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతుంటే చంద్రబాబు బెదిరిస్తున్నాడు. ఎవరైనా రైతుల కోసం మాట్లాడితే వారిని బెదిరిస్తున్నారు. ఎన్ని ఎకరాల పొలం ఉన్న వారికైనా ఒక బస్తా యూరియా మాత్రమే ఇస్తున్నారు. రైతుల అవసరాలను ప్రభుత్వం గుర్తించాలి. సీజన్‌కి సిద్ధంగా ఉండాలి. సీజన్ అయ్యాక యూరియా ఇస్తానంటే ఎవరికీ కావాలి. ఎవరైనా మాట్లాడితే జైలులో వేస్తానని సీఎం అంటున్నారు. సీఎం మాట్లాడే బాష ఇదేనా?. గతంలో అన్నీ అందుబాటులో పెట్టాం కాబట్టి గతేడాది ఇలాంటి సమస్య రాలేదు. రైతులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది’ అని తెలిపారు.