
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీ ఎంపీ ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏ తప్పు చేయకపోయినా కక్షపూరితంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ప్రభుత్వం అనుసరిస్తుందని మండిపడ్డారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్‌లో మాజీమంత్రి అమర్నాథ్, విజయనగరం జడ్పీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ కలిశారు. అనంతరం, మాజీ మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారు. తప్పుడు కేసు పెట్టి మిథున్ రెడ్డిని జైల్లో ఉంచారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగింది. అయినప్పటికీ ఆయన ధైర్యంగా ఉన్నారు. పార్టీ కోసం అన్ని భరిస్తానని మిథున్ రెడ్డి చెప్పారు.
అధికారులు అడిగిన అన్ని రకాల డాక్యుమెంట్‌లను మిథున్ రెడ్డి అధికారులకు ఇచ్చారు. ఏ తప్పు లేకపోయినా కక్ష పూరితంగా మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు. పేర్లు చెప్పిన వారు బయట ఉన్నారు.. ఏ తప్పు చేయని వ్యక్తిని లోపల ఉంచారు. ఎవరో ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై అరెస్టులు చేయటం కరెక్ట్ కాదు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ప్రభుత్వం అనుసరిస్తుంది. బాలకృష్ణ మాట్లాడిన మాటలు చూశాం. చిరంజీవి ఇచ్చిన కౌంటర్ చూశాం. రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనికోసం మరో డైవర్షన్ అమలు చేస్తున్నారు. పార్టీ నేతలకు ఏ సమస్య వచ్చినా పార్టీ కేడర్ అంతా అండగా ఉంటాం. మిథున్ రెడ్డి అరెస్టుకు కచ్చితంగా ప్రతీకారం ఉంటుంది’ అని హెచ్చరించారు.
విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘మిథున్ రెడ్డిని ప్రభుత్వం ఏ రకంగా ఇబ్బందులు పెడుతుందో ప్రజలు గమనిస్తున్నారు. 15 నెలలుగా రాష్ట్రంలో అనేక దారుణాలు చోటుచేసుకున్నాయి. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ మాటలు చూస్తే ప్రభుత్వ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అని అన్నారు.

కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ..‘ఇది కూటమి ప్రభుత్వం కాదు.. కుట్ర ప్రభుత్వం. వైఎస్సార్‌సీపీలో కీలకంగా ఉన్న నాయకులను టార్గెట్ చేయడం ప్రభుత్వ లక్ష్యం. కూటమి ప్రభుత్వానికి ప్రజలు సమాధానం చెప్పాలని ఎదురుచూస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలతో కక్షసాధింపు చేస్తే ఊరుకునేది లేదు. బ్యాలెన్స్ తప్పిన బాలకృష్ణ.. చిరంజీవిపై వ్యాఖ్యలు చేసినా పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం విడ్డూరం. ప్రభుత్వానికి కళ్ళు లేవని మిథున్ రెడ్డి అరెస్టుతో నిరూపితమైంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.