
సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులతో తాను భయపడే ప్రసక్తే లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి(MP Mithun Reddy). కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌కు(YS Jagan) ధన్యవాదాలు తెలిపారు. జైలులో తనను టెర్రరిస్టు మాదిరిగా ట్రీట్ చేశారు అంటూ సంచలన విషయాలను వెల్లడించారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా తిరుపతిలో(Tirupati) మీడియాతో మాట్లాడుతూ..‘అక్రమ కేసులతో నేను అధైర్యపడను. టీడీపీ ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు పెట్టింది. వేధించడానికే నాపై కేసులు పెట్టారు. ఇలా అక్రమ కేసులు పెట్టి సాధించింది ఏంటి?.. పైశాచిక ఆనందం తప్ప మరేమీ లేదు. నన్ను అరెస్ట్ చేసి నా తల్లిదండ్రులను మానసిన వేదనకు గురి చేశారు. 73 రోజులు.. దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారు. గౌరవ కోర్టు నాకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ ఆర్డర్‌లో కోర్టు చెప్పినవన్నీ నిజాలే. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. చివరిగా ఒకటే చెబుతున్నా.. నేను ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టీ డైవర్షన్ చేస్తున్నారు. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
ఎప్పుడు తెలుగుదేశం(TDP) పార్టీ అధికారం ఉన్నా.. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తున్నారు. 2014-2019 మధ్య కూడా నాపై తప్పుడు కేసులు పెట్టారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతీసారి.. ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. రకరకాల అక్రమ కేసులు పెట్టి.. డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. నన్ను జైలులో దారుణంగా చూశారు. ఏదో టెర్రరిస్టు మాదిరిగా ట్రీట్ చేశారు. ఎవరితో నన్ను మాట్లాడనివ్వలేదు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. విజయవాడ నుంచి మానిటరింగ్ చేశారు, అధికారులు కూడా భయపడే పరిస్థితి ఉండేది. నాతో ఒక్క అధికారి కూడా మాట్లాడలేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చేవరకు జైలు అధికారులు వసతులు కల్పించలేదు. నన్ను కలిసే వారిపై కూడా నిఘా పెట్టారు. వ్యక్తికి ఉండాల్సిన ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘించారు’ అని చెప్పుకొచ్చారు.
ఇది కూడా చదవండి: మహిళలకు బాబు మోసం