
సున్నా వడ్డీకి సున్నా... ఆడబిడ్డ నిధి ఔట్.. ‘స్త్రీనిధి’కి గండం..
ఇప్పటికే ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పూర్తిగా రద్దు
వైఎస్ జగన్ ఇచ్చినవాటన్నిటికీ కూటమి సర్కారు మంగళం
మేనిఫెస్టోలో ఇచ్చిన ఆడబిడ్డ నిధి హామీకి చంద్రబాబు ఎగనామం
రాష్ట్రంలోని 1.80 కోట్ల మంది మహిళలకు ఏటా రూ.18 వేలు చొప్పున ఇస్తామని హామీ
ఆ పథకం అమలు చేయకుండా తొలి ఏడాది రూ.32 వేల కోట్లకు పైగా ఎగవేత
పొదుపు సంఘాలకు రూ.3 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలిచ్చి ఆదుకున్న వైఎస్ జగన్.. అక్క చెల్లెమ్మళ్లకు ఐదేళ్లలో రూ.5 వేల కోట్ల లబ్ధి
ఎన్నికల కోడ్ కారణంగా చివరి ఏడాది ఆగిన నిధుల విడుదల.. అనంతరం వాటిని చెల్లించకుండా తొక్కిపెట్టిన బాబు సర్కారు
తాను అధికారంలోకి వస్తే సున్నా వడ్డీ ఏకంగా రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి వర్తింపచేస్తామన్న చంద్రబాబు
సున్నా వడ్డీ కింద మహిళలకు చంద్రబాబు ఇవ్వాల్సింది దాదాపు రూ.6 వేల కోట్లు
ఆ పథకాన్నే ఎగరగొట్టేసి మహిళలకు దాదాపు రూ.7 వేల కోట్ల మేర బాబు సర్కారు బకాయి
ఇప్పుడు ఆర్బీఐ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా ‘స్త్రీనిధి’కి ఎసరు.. హామీలు నెరవేర్చకుండా ద్రోహం
మహిళలు కేంద్రంగా పథకాలను అమలు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్
బ్యాంకు లింకేజీతో పొదుపు మహిళలకు రూ.1.70 లక్షల కోట్ల రుణాలు
స్త్రీనిధి ద్వారా దాదాపు మరో రూ.13,172 కోట్ల రుణాలు
సున్నా వడ్డీ అమలుతో రూ.ఐదు వేల కోట్ల మేర మహిళలకు ప్రయోజనం
వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలతో ఉచితంగా ఆర్థిక సాయం
గత ప్రభుత్వంలో ఆ రెండు పథకాలతో అర్హులకు రూ.427 కోట్లకుపైగా లబ్ధి
సాక్షి, అమరావతి: హామీలతో మభ్యపుచ్చిన చంద్రబాబు సర్కారు మరోసారి మహిళలను దారుణంగా దగా చేస్తోంది. ఇప్పటికే మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను పూర్తిగా రద్దు చేసిన కూటమి ప్రభుత్వం 1.80 కోట్ల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి.. కోటి మందికిపైగా పొదుపు మహిళలకు సున్నా వడ్డీని ఎగరగొట్టింది. తాను అధికారంలోకి వస్తే సున్నా వడ్డీని రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తామన్న ఎన్నికల హామీపై సీఎం చంద్రబాబు ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తున్నారు.
ఈ మోసాలు ఇంతటితో ఆగడం లేదు. ఒకపక్క ఎన్నికల హామీలను నెరవేర్చకుండా.. మరోపక్క ఆర్బీఐ, చట్ట నిబంధలనకు విరుద్ధంగా ‘స్త్రీనిధి’కి ఎసరు పెడుతున్నారు. స్త్రీనిధి నుంచి మహిళలకు హక్కుగా రావాల్సిన డబ్బులను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించి తిరిగి వసూలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికీ.. ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.18 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చింది.
ఈ లెక్కన ఓ ఇంట్లో 18 ఏళ్లు దాటిన మహిళలు ఇద్దరు ఉంటే ఏటా రూ.36 వేల చొప్పున ఇవ్వాలి.. అదే నలుగురు ఉంటే రూ.72 వేలు ఇవ్వాల్సి ఉండగా ఈ పథకాన్ని ఎగరగొట్టింది. ఆడబిడ్డ నిధి పథకాన్ని 16 నెలలు దాటినా అమలు చేయలేదు. మరోవైపు.. వైఎస్సార్ సీపీ హయాంలో ఐదేళ్లపాటు పొదుపు సంఘాల మహిళలకు అమలు చేసిన సున్నా వడ్డీ పథకం సైతం కూటమి సర్కారు వచ్చాక నిలిచిపోయింది.
గత ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలు తీసుకునే రుణాలపై రూ.3 లక్షల వరకే సున్నా వడ్డీ అమలు చేసిందని, తాము అధికారంలోకి వస్తే సున్నా వడ్డీ రూ.10 లక్షల దాకా వర్తింపజేస్తామంటూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కూటమి నేతల హామీ మేరకు ఈ పథకం అమలుకు ఏటా సుమారు రూ.ఆరు వేల కోట్ల దాకా అవసరమని అంచనా.
నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా ఏప్రిల్‌లో ఈ పథకాన్ని అమలు చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా 2024 ఏప్రిల్‌లో నిధుల విడుదల నిలిచిపోగా అనంతరం కూటమి సర్కారు ఆ ఏడాది డబ్బులను మహిళలకు బకాయి పెట్టింది. రెండేళ్లకు సంబంధించి ఒక్క సున్నా వడ్డీ పథకం ద్వారానే బకాయిలతో కలిపి సుమారు రూ.7,000 కోట్ల మేర రాష్ట్రంలోని కోటి మందికి పైగా పొదుపు సంఘాల మహిళలకు చెల్లించాల్సి ఉన్నా చంద్రబాబు సర్కారు పైసా ఇవ్వలేదు.
ఇక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 1.80 కోట్ల మంది మహిళలు ఏటా రూ.18 వేలు చొప్పున సాయం పొందేందుకు అర్హులని అంచనా. ఈ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడంతో మహిళలు ఏటా రూ.32,400 కోట్లు దాకా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ హయాంలో అన్ని సంక్షేమ పథకాలను మహిళలు కేంద్రంగా సంతృప్త స్థాయిలో అమలు చేసి మహిళా సాధికారతకు బాటలు వేశారు.
మహిళలకు నేరుగా పథకాలు అందచేయడంతో రూ.1.89 లక్షల కోట్ల మేర డీబీటీ విధానంలో ప్రయోజనం పొందారు. వైఎస్ జగన్ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేసిన రూ.1.70 లక్షల కోట్ల రుణాలు కాకుండా స్త్రీనిధి ద్వారా దాదాపు మరో రూ.13,172 కోట్లు రుణాలు పొదుపు సంఘాల మహిళలకిచ్చింది. ఇక సున్నా వడ్డీ ద్వారా గత ప్రభుత్వ హయాంలో 3.86 కోట్ల మంది మహిళలు దాదాపు రూ.ఐదు వేల కోట్ల మేర ప్రయోజనం పొందారు.
‘స్త్రీనిధి’కి ఎసరు..
ఎన్నికల హామీలను నెరవేర్చకుండా మహిళలను మోçసం చేస్తున్న చంద్రబాబు సర్కారు మరో మోసపూరిత ఎత్తుగడకు తెర తీసింది. పొదుపు సంఘాల మహిళలు తమ హక్కుగా రుణాలను పొందే ‘స్త్రీనిధి’ డబ్బులను.. ఆర్బీఐ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా ‘ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మీ’ ‘ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ’ పథకాలకు మళ్లించేందుకు సిద్ధమైంది.
నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు– షాదీ తోఫా పథకాల ద్వారా అర్హులకు పూర్తి ఉచితంగా ఆర్థిక సహాయం అందజేస్తే.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పేర్లు మార్చిన ఆ పథకాలకు పొదుపు సంఘాల మహిళలకు రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు రుణం మాత్రమే ఇవ్వనుంది. దానిపై నాలుగు శాతం వడ్డీతో కలిపి అసలు వసూలు చేసేందుకు సమాయత్తమైంది. గత ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా రూ.427.27 కోట్ల మొత్తాన్ని ఆయా లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధానంలో అర్హులకు అందచేయడం గమనార్హం.
వడ్డీకి తెచ్చిన డబ్బులు.. అంతకంటే తక్కువకు ఇవ్వాలట!
ఈ ఆర్థిక ఏడాది దాదాపు రూ.ఐదు వేల కోట్లను స్త్రీనిధి సంస్థ ద్వారా పొదుపు సంఘాల మహిళలకు రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంత నిధులు తక్కువగా ఉండే స్త్రీనిధి సంస్థ.. ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులనే 11 శాతం వడ్డీకి పొదుపు మహిళలకు రుణంగా ఇస్తూ ఉంటుంది. మండల సమాఖ్య పేరిట ఉండే దాదాపు రూ.1,000 కోట్ల సీఐఎఫ్ (కామన్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్) నిధులను ఇటీవల బలవంతంగా స్త్రీనిధి బ్యాంకులో జమ చేయించారు.
బ్యాంకుల నుంచి స్త్రీనిధి సంస్థ ఏడు శాతం వడ్డీకి తెచ్చుకునే నిధులతో పాటు మండల సమాఖ్య నుంచి జమ అయిన నిధుల నుంచి ఒక్కో పథకానికి రూ.500 కోట్లు చొప్పున ఏటా రూ.వెయ్యి కోట్లు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మీ, ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ పథకాల లబ్ధిదారులకు రుణంగా ఇప్పించేలా ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంతేగానీ.. ఆయా పథకాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎటువంటి ఆర్థిక సాయం అందించే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
వడ్డీకి తెచ్చే డబ్బులను అంత కంటే తక్కువ వడ్డీకి రుణం ఇవ్వడమంటే ఎలాంటి సంస్థ అయినా నష్టాల పాలు కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ రెండు పథకాలకు తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల స్త్రీనిధి సంస్థ నష్టాల ఊబిలోకి వెళ్లి మూతపడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 12 ఏళ్లుగా పేద మహిళల సంక్షేమం కృషి చేస్తున్న సంస్థను బలి పెట్టే యత్నాలను తప్పుబడుతున్నారు.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో త్వరలో ఓ కార్యక్రమం నిర్వహించి పథకాల అమలుపై సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన చేయనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ గతంలోనే ఈ అంశాలను వెలుగులోకి తెచ్చింది. స్త్రీనిధి సంస్థను నీరుగార్చే యత్నాలను బహిర్గతం చేసింది. దీంతో ఈ ఏడాది మార్చిలో ఆ పథకాల అమలును ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది.
బాబు మోసంతో అప్పుల ఊబిలోకి..
జగన్ హయాంలో సంఘాలు పునరుజ్జీవం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాం నుంచి సున్నా వడ్డీ పథకం అమలు జరుగుతుండగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014–19 మధ్య అర్ధారంతంగా ఆగిపోయింది. దీంతో పొదుపు సంఘాల వ్యవస్థ కుదేలైంది. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని 2014 ఎన్నికల ముందు ప్రకటించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా.. సున్నా వడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారు. ఫలితంగా పొదుపు సంఘాలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎన్‌పీఏలు (నిరర్థక ఆస్తులు)గా మారాయి.
చంద్రబాబు హయాంలో ఒక దశలో 18.36 శాతం సంఘాలు ఎన్‌పీఏలుగా ముద్రపడ్డాయి. అనంతరం వైఎస్ జగన్ హయాంలో పొదుపు సంఘాలు పునరుజ్జీవమయ్యాయి. నాడు ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు.. 2019 పోలింగ్ నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకు ఉన్న అప్పు మొత్తం రూ.25,571 కోట్లను ‘ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో తిరిగి మహిళలకు నేరుగా చెల్లించడంతో పాటు సున్నా వడ్డీ పథకాన్ని క్రమం తప్పకుండా అమలు చేశారు. తద్వారా పొదుపు మహిళలు ఎప్పటికప్పుడు రుణాలను తిరిగి సకాలంలో చెల్లించే పరిస్థితులు ఏర్పడడంతో నాడు ఎన్‌పీఏల సంఖ్య కేవలం 0.17 శాతానికి తగ్గిపోయింది.
(నోట్: 2018–19 మధ్య టీడీపీ సర్కారు కేవలం రూ. 895 కోట్లు మాత్రమే స్త్రీనిధి ద్వారా పొదుపు సంఘాల మహిళలకు రుణం ఇవ్వగా.. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని రెట్టింపు కంటే ఎక్కువకు పెంచింది. అంతేకాకుండా.. అంతకు ముందు పొదుపు సంఘాల మహిళలకు 13 శాతం చొప్పున వడ్డీకి రుణాలు ఇస్తుండగా అప్పటి సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకొని ఆ రుణాలపై వడ్డీని రెండు శాతం తగ్గించి 11 శాతానికే అందించే ఏర్పాటు చేశారు)