ఇంటింటా నిజం.. తల్లికి మోసం | Chandrababu Naidu Govt Fraud to Womens in AP With Thalliki Vandanam | Sakshi
Sakshi News home page

ఇంటింటా నిజం.. తల్లికి మోసం

Jul 24 2025 3:46 AM | Updated on Jul 24 2025 9:26 AM

Chandrababu Naidu Govt Fraud to Womens in AP With Thalliki Vandanam

రూ.15 వేలకు బదులు రూ.8,850 మాత్రమే పడ్డాయి 

మొదటి ఏడాది ఒక్కరికీ ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం

రెండో ఏడాది 30 లక్షల మందికి ఎగరగొట్టారు 

మిగిలిన వారికి రూ.13 వేలిస్తామని ప్రకటించారు

చివరికి రూ.8వేలు, రూ.9వేలు మాత్రమే జమ చేసి చేతులు దులుపుకున్నారు.. 

తల్లికి వందనం కింద రూ.15 వేలిస్తామని సూపర్‌ సిక్స్‌లో ఊదరగొట్టారు.. 

ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఇస్తామని చెప్పారు.. 

లబ్ధిదారులను తగ్గించేసి.. ఇచ్చే మొత్తం కోసేసి.. ఇదేమి అమలు బాబూ? 

సమాధానం చెప్పేవారే లేరంటూ తల్లుల ఆగ్రహం 

హామీలన్నీ నెరవేర్చేశామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. 

ఇక సూపర్‌ సిక్స్‌ గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక మందమంటూ దబాయింపు..  

ఈమె పేరు కొండేటి మరియమ్మ. పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు. ఈమె కుమారుడు అవినాష్‌ ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం ద్వారా కేవలం రూ.8,850 మాత్రమే ఆమె ఖాతాలో పడ్డాయి. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని, త్వరలో కేంద్ర ప్రభుత్వ వాటా జమ అవుతుందని సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని ఆమె చెబుతోంది. అందరితోపాటు తనకూ సమానంగా డబ్బులు పడ్డాయంటోంది. ఇప్పుడు రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇలా చేశారేమిటని ఆవేదన వ్యక్తం చేస్తోంది.    

సాక్షి, అమరావతి : ‘అధికారంలోకి రాగానే సూపర్‌ సిక్స్‌ను అమలు చేసి పేదరికాన్ని పారదోలుతాం.. తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తాం..’ అని చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు కూటమి సర్కారు ఆ తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ప్రధానంగా తల్లికి వందనం పథకం గురించి చంద్రబాబు, లోకేశ్‌ సహా టీడీపీ శ్రేణులు ఊరూరా, ఇంటింటా ఊదరగొట్టాయి. 

అధికారం చేపట్టాక తొలి ఏడాది ఈ పథకాన్ని అమలు చేయకుండా మోసం చేయడం ఒక ఎత్తు అయితే.. రెండో ఏడాది అరకొరగా అమలు చేస్తూ.. చాలా గొప్పగా అమలు చేశామని డప్పు కొట్టు కోవడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి.. అమలు దశకు వచ్చే సరికి రూ.13 వేలే అన్నారు. 

వివిధ సాకులు చూపి ఏకంగా 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. తీరా మిగిలిన లబ్ధిదారుల్లో కొంత మందికి కేవలం రూ.8–9 వేలు మాత్రమే ఖాతాల్లో వేసి.. అంతా ఇచ్చేశామంటున్నారు. ఇదొక్కటే కాదు.. సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ అమలు చేసేశామని, ఇక వీటి గురించి ఎవరైనా మాట్లాడితే వారి నాలుక మందమే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దబాయిస్తూ మాట్లాడారు. 

‘తల్లికి వందనం’ అమలుతో చంద్రబాబు చేస్తున్న దగాపై ఊరూరా మహిళలు, విద్యార్థులు రగిలిపోతున్నారు. కొన్ని ఊళ్లలో అయితే ఏకంగా స్కూలు మొత్తం మీద ఒక్కరికి కూడా ఇవ్వలేదు. నిరుపేదలకు సైతం ఎగనామం పెట్టేశారు. చెప్పిందేమిటి.. చేసిందేమిటి.. అంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెడ్‌మాస్టర్లు, బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తమకెందుకు డబ్బులు పడలేదంటూ నిలదీస్తున్నారు. ‘మేమేం చేయలేం. 

అలా ఎందుకు జరిగిందో మాకు తెలీదు’ అంటూ వారు చేతులెత్తేస్తున్నారు. కనీసం ఇస్తామన్న రూ.13 వేలు కూడా ఎందుకు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతుంటే సమాధానం చెప్పేవారే లేరు. నష్టపోయిన వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులే కావడం గమనార్హం.  

నగదు జమ కాకుండానే మెసేజ్‌లు  
రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు యూడైజ్‌లో నమోదైన విద్యార్థులు 87.42 లక్షల మంది ఉంటే తొలి ఏడాది అందరికీ తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టింది. రెండో ఏడాది లబ్ధిదారుల్లో 30 లక్షల మందిని తప్పించింది. మిగిలిన వారికి రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పినా.. ఆ తర్వాత రూ.13 వేలే అంది. తర్వాత సాకు దొరికిన చోటల్లా నిధుల్లో కోతపెట్టింది. 

కొందరికి రూ.9 వేలు, ఇంకొందరికి రూ.8 వేలు, మరికొందరికి రూ.8,800 చొప్పున ఇచ్చి, మిగిలిన డబ్బును ఎగవేసింది. ఇలా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన లబ్ధిదారుల్లో కొందరికి నగదు జమ కాగా, ఇంకొందరికి నగదు జమ కాకుండానే నిధులు జమ చేశామని వారి ఫోన్లకు సంక్షిప్త (ఎస్‌ఎంఎస్‌) సందేశాలను పంపిస్తోంది. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.  

పథకం ఎగవేతకు అనేక సాకులు
గతంలోనూ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలను ఎగ్గొట్టిన టీడీపీ ప్రభత్వం.. ఇప్పుడు కూటమి సర్కారులోనూ అదే పంథాను అనుసరిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌–6 హామీలు అమలు చేయకుండానే అన్నీ చేసేసినట్టు ప్రచారం చేసుకుంటోంది. తల్లికి వందనం పథకం అమలులో ప్రతి దశలోనూ ప్రజలను దగా చేస్తోంది. 

అర్హుల ఎంపికలోనూ, నిధుల మంజూరులోనూ కోతలు పెట్టింది. దీనికి వీలైనన్ని కారణాలను వెతుకుతూ విద్యార్థుల సంఖ్యను నానాటికీ తగ్గించేస్తోంది. ఇంకా తల్లికి వందనం పడని విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉండడం గమనార్హం. వచ్చే ఏడాది దీన్ని మరింత కుదించేందుకు ఇప్పటి నుంచే పథకం రూపొందించారు.  

ముగ్గురికీ డబ్బులు పడలేదు 
మా పిల్లలు రిషికుమార్, పూజిత, జాహ్నవిలు ముగ్గురూ తల్లికి వందనం పథకానికి అర్హులని ఆన్‌లైన్‌లో వచ్చింది. అందరికీ పడినట్లే మాకు ముగ్గురు పిల్లలకూ కలిపి రూ.45 వేలు పడతాయని ఎదురు చూశాం. కానీ పడలేదు. అధికారులను అడిగితే తమ చేతుల్లో లేదని, ప్రభుత్వం వెయ్యాలని అంటున్నారు. ఆన్‌లైన్‌లో చూస్తే ‘పేమెంట్‌ హోల్డ్‌ బై డిపార్టుమెంట్‌ ఆర్‌టీఈ’ అని చూపిస్తోంది. 



ఇలా ఎందుకు వచ్చిందని, అసలు డబ్బులు పడతాయా, లేదా అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. రెండు వారాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. గతంలో ఎప్పుడూ సమయానికి అమ్మ ఒడి డబ్బులు పడేవి. గత సంవత్సరం ఎలాగూ ఇవ్వలేదు. ఈ ఏడాది ఇలా మెలిక పెట్టి ఆపేశారు. అర్హత ఉన్నా మాలాంటి చాలా మంది డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నారు. 
– నూజివీడు దేవి, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం 

 
అర్హులను తగ్గించేందుకు తంటాలు  
ఈ ఏడాది రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివే పిల్లలు యూడైజ్‌లో 87.42 లక్షల మంది నమోదై ఉంటే 67,27,164 మందికే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అందరికీ తల్లికి వందనం ఇస్తామన్న హామీకి తూట్లు పొడిచింది. ఆ తర్వాత 54,94,703 మందికే పథకం ఇస్తున్నట్టు జీఓ విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపికలో భారీగా కోత పెట్టింది. 

ఏటా విద్యుత్‌ బిల్లు వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని సగటున నెలకు 300 యూనిట్లు లోపు వినియోగించే వారికి మాత్రమే పథకం ఇస్తామని మెలిక పెట్టింది. కానీ ఆరు నెలల కాలాన్ని సగటున పరిగణనలోకి తీసుకోకుండా చాలా మందికి అన్యాయం చేసింది. తొలుత మున్సిపల్‌ కారి్మకులకూ పథకం వర్తింపజేస్తున్నట్టు ప్రకటించిన సర్కారు.. తర్వాత కేవలం శానిటేషన్‌ వర్కర్లకు మాత్రమే పరిమితం చేసింది. వారిలోనూ సగం మందికి డేటా సరిగా లేదని ఎగనామం పెట్టింది.   


పచ్చి మోసం.. దగా.. 
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం హైసూ్కల్లో 300 మంది విద్యార్థులు చదువుతుంటే ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం ఇవ్వలేదు. ఇలాంటి ఘటనలు ప్రతి జిల్లాలోనూ చోటు చేసుకున్నాయి. ఎలిజిబుల్‌ జాబితాల్లో మాత్రం పెయిడ్‌ అని చూపిస్తోందని, అకౌంట్‌లో మాత్రం డబ్బులు జమ కాలేదని అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మంగళవారం విద్యార్థులు రోడ్డెక్కారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు లెక్కలేనన్ని కనిపిస్తున్నాయి. డబ్బులు రాకపోయినా వచ్చాయంటూ మెసేజ్‌లు పంపించడంపై ప్రజలు మండిపడుతున్నారు. వీటిపై ఇటు అధికారులు, అటు బ్యాంకర్లు, హెడ్‌మాస్టర్లు అక్కచెల్లెమ్మలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. సీఎం చంద్రబాబు మాత్రం సూపర్‌ సిక్స్‌ సహా అన్ని హామీలూ నెరవేర్చామని కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు. 

వీటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే.. వారి నాలుకే మందం అంటూ హూంకరిస్తున్నారు. కూటమి సర్కారు తీరు చూస్తుంటే.. ‘ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఒడ్డు చేరాక బోడి మల్లన్న’ అన్నట్లుందని మహిళలు, విద్యార్థులు రగిలిపోతున్నారు. ఇంత పచ్చిగా మోసం చేస్తారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement