సాక్షి, తిరుపతి: మంత్రి నారా లోకేష్‌కు కక్ష సాధింపు చర్యలు తప్ప రాష్ట్ర అభివృద్ధి తెలియదని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అధికారం శాశ్వతం కాదు.. ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి. మీ నాన్నను జైల్లో పెట్టారని నీకు కనిపించిన వాళ్లందరినీ జైల్లో పెడతావా? అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి వైఎస్సార్‌సీపీలో ఏ ఒక్కరూ భయపడరు. మా పార్టీ నాయకులపైన అన్యాయంగా, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. అధికారం ఉంది కదా అని తప్పుడు కేసులు పెడతామని చూస్తే దీని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. అధికారం శాశ్వతం కాదు. అధికార మదంతో లోకేష్ ఉన్నాడు. తన తల్లిని అంబటి రాంబాబు అవమానించాడు అంటూ లోకేష్ అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. విచారించుకోండి నేను ఏరోజు ఆయన తల్లిని అవమానించలేదు. మీ నాన్నను జైల్లో పెట్టారని నీకు కనిపించిన వాళ్లందరినీ జైల్లో పెడతావా?. ఎంత మందిని జైలులో పెడతారు?. జైల్లో పెడితే బయటకు రామా.. మీరు ఏమైనా చంపేస్తారా. జైల్లో నుంచి మీ నాన్న చంద్రబాబు బయటకు రాలేదా?.
ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మొదలైంది. అన్నీ ప్రజలే చూస్తున్నారు. రాబోయే మూడేళ్లలో మేమంతా ఎలా బలపడతామో మీరే ఊహించుకోండి. కూటమి ప్రభుత్వానికి ఓట్లు ఎందుకు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ జగన్ పర్యటనకు లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఆయన్ను ఓడించాము అనే బాధతో ప్రజలు ఆయన పర్యటనకు తరలి వస్తున్నారు.
మీ రెడ్‌బుక్ బంగాళాఖాతంలో మునగడం ఖాయం. పవన్ కళ్యాణ్.. మీరు 15 ఏళ్లు కాదు జీవితాంతం కలిసే ఉండండి మాకేం నష్టం లేదు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరిగింది మీరు కలిసి ఉంటేనే మాకు కలదు సుఖం. మేము బలపడతాం. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ.. చిరంజీవిని అవమానిస్తే పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు. మీరు పోరాట యోధులు అన్నారు. అన్యాయం జరిగితే సహించరు అన్నారు ఇదేనా?. నువ్వు చెప్తే నమ్మి కాపులందరూ చంద్రబాబుకు ఓటు వేశారు. మీ పోరాట పటిమని గంగలో ముంచేయండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


