
సాక్షి, తాడేపల్లి: ఏపీలో రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. లేని లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్‌సీపీ కీలక నాయకుల అరెస్టుల పర్వం సాగుతోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మంది అరెస్టు చేయగా.. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సిట్ అరెస్టు చేసింది. ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసి 48 మంది పేర్లను ఛార్జిషీటులో సిట్ పేర్కొంది. మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కీలక నేతల అరెస్టే లక్ష్యంగా సిట్ అధికారులు పనిచేస్తున్నారు.
నిజానికి చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ జగన్ జగన్ హయాంలోనే ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చింది. అయినప్పటికీ రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ తప్పుడు కేసు నమోదు చేశారు. రూ.50 వేల కోట్లు కొట్టేశారంటూ అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు. రూ.35 వేల కోట్లు అంటూ పవన్ కల్యాణ్ బొంకారు. ప్రభుత్వ పెద్దలు నోటి కొచ్చినట్లు మాట్లాడుతూ లేని స్కాంని ఉన్నట్టు భేతాళ కథలు అల్లుతున్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టునే ఛార్జిషీటు, రిమాండ్ రిపోర్టుల్లో సిట్ పేర్కొంటుంది. ఎల్లోమీడియా తప్పుడు రాతలు, సిట్ తప్పుడు విచారణలపై వైఎస్సార్‌సీపీ మండిపడింది. కోర్టుల్లోనే న్యాయ పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ అంటోంది. ఇప్పటికే ఎంపీ మిథున్‌రెడ్డికి ఆ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు.