
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు వైఎస్సార్‌సీపీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అక్రమ కేసులో పక్కా ప్లాన్ ప్రకారమే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికే అరెస్టు చేశారని ఆరోపించారు. ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవు అని చెప్పుకొచ్చారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని మూలాఖత్‌లో వైఎస్సార్‌సీపీ స్టేట్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు మేడపాటి షర్మిల రెడ్డి, శ్రీనివాసులరెడ్డిలు కలిశారు. అనంతరం, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ..‘కట్టు కథతో మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు. మిథున్ రెడ్డి అరెస్టు ఆశ్చర్యం కలిగించలేదు. దేశంలోనే పెద్ద స్థాయికి ఎదిగిన వ్యక్తి మిథున్ రెడ్డి. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి పెద్ద స్థాయిలో ఉంటే భవిష్యత్తులో టీడీపీకి ఇబ్బంది అని భావించి, అక్రమ కేసులో అరెస్టు చేశారు.
కూటమి గాలిలో ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డిపై మిథున్ రెడ్డి విజయం సాధించారు. ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటానికే అరెస్టు చేశారు. కస్టడీకి ఎందుకు ఇప్పటి వరకు పిలవలేదు. ఇటువంటి కేసులు ఎక్కువ కాలం నిలబడవు. కథలు చెప్పి వాటిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు ఒక్కరినైనా తిరిగి తీసుకొచ్చారా?. గత ప్రభుత్వంలో కల్తీ లిక్కర్ తాగి చనిపోయారు అన్నారు.. ఒక్క ఆధారమైన ఉందా?.
కల్తీ మద్యంతో ఎంతో మంది ఆసుపత్రి పాలైతే ఒక కేసు అయినా నమోదు చేశారా?. గత ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసు ఆధారాలు చెరిపేసిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించటం దారుణం. ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు.. టీడీపీ నాయకులపై ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ అన్నివేళలా మద్దతుగా ఉన్న వ్యక్తులకు మా మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుంది. అన్నదాత సుఖీభవ గానీ ఇతర ఏ ప్రభుత్వ పథకం గాని ఇప్పటివరకు సక్రమంగా అమలు చేయలేదు ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. మిథున్ రెడ్డి ఎంపీ అయినా కేటాయించాల్సిన సదుపాయాలు కూడా కల్పించడం లేదు. జైల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి’ అని చెప్పుకొచ్చారు.
మేడపాటి షర్మిల రెడ్డి మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. సాక్ష్యాలు లేకుండా లిక్కర్ కేసులో మిథున్ రెడ్డిని ఇరికించారు. భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీకి మంచి రోజులు వస్తాయి’ అని తెలిపారు.