
దోపిడీకి పర్మిట్
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025
● కోనసీమ జిల్లాలో విచ్చలవిడిగా పర్మిట్ రూములు
● మొత్తం 144 మద్యం షాపుల్లో 90 చోట్ల అనధికార ఏర్పాట్లు
● మినీ బార్లను మించి సౌకర్యాలు
● అక్కడ తాగేవారికి వాటర్ పేరిట
రూ.10 అదనపు బాదుడు
● కిళ్లీషాప్‌లు... ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అనుమతి ఇవ్వనున్న ప్రభుత్వం
● సొమ్ము చేసుకుంటున్న మద్యం షాపుల యాజమాన్యాలు
● ఆదాయం పెంచుకునేందుకు అంటూ అడ్డదారులు
సాక్షి, అమలాపురం: తాగు... తాగించు.. ఆదాయం పెంచు అనే కూటమి ప్రభుత్వ మద్యం విధానం మరిన్ని కొత్త పుంతలు తొక్కుతోంది. మద్యం దుకాణాల వద్ద అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్‌లతో మద్యం ప్రియుల నుంచి దుకాణదారులు దోచుకుంటున్నారు. ఇప్పుడు ఆ పర్మిట్ రూమ్‌లకు అధికార ముద్ర వేసి ప్రభుత్వం దోపిడీకి సిద్ధమవుతోంది. అదనపు ఆదాయం పేరుతో పర్మిట్ రూమ్‌లకు అనుమతులు ఇవ్వడం అనేది చంద్రబాబు మార్కు సంపద సృష్టి అని సామాన్యులు మండిపడుతున్నారు.
జిల్లాలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో మద్యం దుకాణదారులు చెలరేగిపోతున్నారు. దుకాణాలకు అనుబంధంగా బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన అమలాపురం నుంచి తీర ప్రాంత మత్స్యకార గ్రామం వరకు అటు మద్యం షాపుల యజమానులు.. ఇటు ప్రభుత్వ పెద్దలు మద్యం ప్రియుల జేబులు చిల్లులు పెట్టడంపైనే దృష్టి సారిస్తున్నారు. దుకాణదారులకు బెల్టు షాపుల మీద వస్తున్న ఆదాయం కన్నా పర్మిట్ రూమ్‌ల ఆదాయం అధికంగా ఉంది. జిల్లాలో 144 మద్యం షాపులు ఉండగా, ప్రతి ఐదు దుకాణాలకు మూడు దుకాణాలకు పర్మిట్ రూమ్‌లున్నాయని అంచనా. జిల్లా వ్యాప్తంగా 90కి పైగా మద్యం దుకాణాల వద్ద అనుమతులు లేకుండా పర్మిట్ రూమ్‌లు ఉన్నాయని అంచనా. మద్యం షాపులకు అనుగుణంగా పర్మిట్ రూమ్‌లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతుల పునరుద్ధరణ ప్రక్రియ జరుగుతోంది. ఇది నెలాఖరుకు పూర్తి చేయడంపై ఎకై ్సజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే మద్యం షాపులకు అనుగుణంగా పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అధికారికంగా మార్గదర్శకాలు వెలువడనున్నాయి. జిల్లాలో మద్యం షాపులు ప్రారంభమైన సమయం నుంచే గుట్టుచప్పుడు కాకుండా పర్మిట్ రూమ్‌ల వద్ద తాగిస్తున్న మద్యం షాపుల యజమానులు, ప్రభుత్వం అనుమతులు ఇస్తుందన్న సమాచారం అందడంతో ఉత్తర్వులు అందక ముందే బరితెగించేస్తున్నారు. విచ్చలవిడిగా పర్మిట్ రూమ్‌లు తెరిచేసి తాగించేస్తున్నారు. గ్లాసులు, షోడాలు, వెజ్, నాన్‌వెజ్ స్నాక్స్ ఏర్పాటు చేసి మరీ విక్రయాలు చేపడుతున్నారు. అర్ధరాత్రి వరకూ రూములు తెరిచే ఉంచుతున్నారు. దీంతో ఆ ప్రాంతం తాగుబోతులతో రద్దీగా మారుతోంది. అక్కడే తాగి.. అక్కడే తూలుతున్నారు. అటుగా వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణాలు, మండల కేంద్రాలు, సామాన్య గ్రామాలు ఇలా ఎక్కడైనా మద్యం దుకాణం ఉంటే చాలు వాటి పక్కనే పర్మిట్ రూమ్‌లు కూడా ఉన్నాయి. చివరకు బ్యాంకులు, పాఠశాలల సమీపంలో కూడా ఇవి ఉండడం విశేషం.
బార్లను తలపిస్తున్నాయి
మద్యం దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన పర్మిట్ రూమ్‌లు బార్లను తలపిస్తున్నాయి. వీటి వద్ద సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సువిశాల ప్రాంగణాల్లో గదులు ఏర్పాటు చేశారు. మందుబాబుల కోసం కుర్చీలు, టేబుళ్లు అందుబాటులో ఉంచారు. వర్షం, ఎండ పడకుండా విశాలమైన షెడ్లు వేసి.. బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పర్మిట్ రూమ్‌ల అమ్మకాలు మద్యం దుకాణదారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇక్కడ కూర్చుని తాగే వారి నుంచి క్వార్టర్‌కు అదనంగా రూ.పది చొప్పున వసూలు చేస్తున్నారు. వీటితోపాటు ఇక్కడ ఏర్పాటు చేసే కిళ్లీ బడ్డీలకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు నెలవారీ అద్దె మీద దుకాణాలు ఇస్తూ కాసులు దండుకుంటున్నారు.
జిల్లా కేంద్రంలో లెక్కలేని తనం
జిల్లా కేంద్రమైన అమలాపురంలో మద్యం అమ్మకాలు పట్టపగ్గాల్లేకుండా సాగుతున్నాయి. స్థానిక కీలక నాయకుడి ఆధ్వర్యంలో అధికార పార్టీ సిండికేటు నడుస్తుండడం, చినబాబు ముఖ్య అనుచరుడి ఆధ్వర్యంలో మరో సిండికేటు ఉండడంతో అడ్డుకునేవారు లేకుండా పోయారు. మున్సిపల్ సర్క్యులర్ బజార్, చిన్న వంతెన, 216 బైపాస్‌కు సమీపంలో కామనగరువు రోడ్డు వద్ద, ఎర్రవంతెన – నల్లవంతెనల మధ్య ఉన్న మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లున్నాయి. అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఎస్‌బీఐ బ్యాంకు, ఆ బ్యాంకు ఏటీఎంల మధ్యలో ఉన్న మద్యం దుకాణం వద్ద కూడా పర్మిట్ రూమ్‌లు ఉండడం గమనార్హం. రామచంద్రపురం, మండపేట పట్టణాలలో కూడా ఇదే పరిస్థితి. రావులపాలెం, కొత్తపేట, పి.గన్నవరం, మలికిపురం వంటి ప్రాంతాల్లో తొలుత రెస్టార్‌ంట్‌లు ఏర్పాటు చేయడం, తరువాత వాటిని పర్మిట్ రూమ్‌లుగా మార్చడం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్, పోలీస్, మున్సిపల్ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అనధికార పర్మిట్ రూమ్‌లను ప్రభుత్వం అధికార ముద్ర వేయనుండడంతో అనుమతుల కోసం కట్టే ఫీజులను సైతం మద్యం ప్రియుల నుంచే దోచేందుకు దుకాణాల యజమానులు సిద్ధమవుతున్నారు.

దోపిడీకి పర్మిట్

దోపిడీకి పర్మిట్