
యువ సమాజాన్ని కాపాడుకుందాం
అమలాపురం టౌన్: బాధ్యతాయుతమైన యువ సమాజాన్ని కాపాడుకుందామని డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ ఎం. దుర్గారావు దొర పిలుపునిచ్చారు. డ్రగ్స్‌తోపాటు ఎయిడ్స్, హెచ్‌ఐవీ వంటి లైంగిక వ్యాధులు దరి చేరకుండా యువతలో అవగాహన పెంచి వాటిని సమూలంగా నిర్మూలిద్దామన్నారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్‌లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వద్ద అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య రుగ్మతలు, అనివార్యమయ్యే పోలీస్ కేసులు, శిక్షల తీవ్రతను ఆయన వివరించారు. డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ సీహెచ్ భరతలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జూన్ 12 నుంచి ఈ నెల 12 వరకూ 8 వారాలపాటు జిల్లాలో విద్యార్థులు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నుంచి మొదలైన అవగాహన ర్యాలీ నల్ల వంతెన వరకూ నినాదాలతో సాగింది. ఆస్పత్రి మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ పసుపులేటి సౌమ్య, డాక్టర్ సాయిరామ్, ఏఆర్‌టీ డేటా ఆపరేటర్ డాక్టర్ సుమిత్ర, డీసీఆర్‌సీ కౌన్సిలర్ కవిత, జన కళ్యాణ్ స్వచ్ఛంధ సంస్థ మేనేజర్ జి.శ్రీను, విహాన్, ఎల్‌డబ్ల్యూల సిబ్బంది, వివిధ విద్యాలయాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.