పెళ్లికి నిరాకరించిందని యువకుడి ఆత్మహత్య | A young man committed suicide | Sakshi
Sakshi News home page

article header script

పెళ్లికి నిరాకరించిందని యువకుడి ఆత్మహత్య

Published Fri, Jun 14 2024 4:39 AM | Last Updated on Fri, Jun 14 2024 4:39 AM

A young man committed suicide

బద్వేలు అర్బన్‌/అట్లూరు: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే మనస్తాపంతో ఓ యువకుడు పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైఎస్సార్‌ జిల్లా బద్వేలు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని కలసపాడు గ్రామానికి చెందిన బాలిరెడ్డి, వెంకట సుబ్బమ్మకు కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడైన పామూరి సాయికుమార్‌రెడ్డి (27) గోపవరం మండలంలో 108 వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు. 

కలసపాడు మండలం సిద్ధ­మూర్తిపల్లెకు చెందిన ఓ యువతి, సాయికుమార్‌­రెడ్డి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆమె అట్లూరు మండలం తంబళ్లగొంది రైతు భరోసా కేంద్రంలో ఉద్యోగం చేస్తోంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో తంబళ్లగొందికి వెళ్లిన సాయికుమార్‌రెడ్డి తనను పెళ్లి చేసుకునేది, లేనిదీ తేల్చాలని.. లేదంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకుని చనిపోదామని ఉమామహేశ్వరిని నిలదీశాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో మనస్తాపానికి గురైన అతను అక్కడి నుంచి నేరుగా పట్టణంలోని సిద్దవటం రోడ్డులో ఉన్న తన అక్క ఇంటికి వచ్చాడు. 

కొద్దిసేపటికి ఆమె సమీపంలోని వారి ఫ్యాన్సీ స్టోర్‌కు వెళ్లిపోగా ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి వంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇంటినుంచి దట్టమైన మంటలు, పొగలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసి లోపలికి వెళ్లి చూడగా సాయికుమార్‌రెడ్డి తీవ్రమైన గాయాలతో మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement