కడప ఎడ్యుకేషన్: పట్టభద్రులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను సమాజాభివృద్ధికి, దేశ నిర్మాణానికి వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, యోగి వేమన విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కడప–తిరుపతి బైపాస్ రోడ్డులోని పాలెంపల్లె వద్ద గల డీఎస్‌ఆర్ పారడైజ్ ఫంక్షన్ హాల్‌లో వైవీయూ 11, 12, 13, 14వ స్నాతకోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఛాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరై ప్రసంగిస్తూ నవభారత నిర్మాణానికి నైపుణ్యాలే పునాది అని వ్యాఖ్యానించారు.
మత సామరస్యానికి ప్రతీక కడప జిల్లా:
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కడప జిల్లా గొప్ప చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని, మత సామరస్యానికి ఇది నిదర్శనమని కొనియాడారు. దేవుని కడప, పెద్ద దర్గా, సెయింట్ మేరీస్ కేథడ్రల్ వంటి క్షేత్రాలు ఇక్కడి ప్రత్యేకతను చాటుతున్నాయన్నారు. జాతీయ విద్యా విధానం–2020 ద్వారా విద్యార్థులను ప్రపంచ సవాళ్లకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని, కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యకు బడ్జెట్‌లో రూ. 56,727 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
వినూత్న ఆలోచనలే పునాది:
డాక్టర్ కోట హరినారాయణ
ప్రముఖ శాస్త్రవేత్త, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) రూపశిల్పి డాక్టర్ కోట హరినారాయణకు గవర్నర్ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 21వ శతాబ్దపు నవభారత ఆవిష్కరణకు యువత విశ్లేషణాత్మక దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ‘ఇన్నోవేషన్ ఇంజనీరింగ్‘ నేటి అవసరమని, నానో టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి ఆధునిక రంగాల్లో కొత్త ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు.
అగ్రశ్రేణి వర్సిటీగా వైవీయూ:
వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ వార్షిక నివేదికను సమర్పిస్తూ.. పీజీ సెంటర్ స్థాయి నుంచి వైవీయూ నేడు దేశంలోని టాప్–100 విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ’పీఎం–ఉష’ ( PM& USHA) పథకం కింద వర్సిటీకి రూ. 20 కోట్ల నిధులు అందాయని తెలిపారు. అలాగే అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ( ANRF) భాగస్వామ్యంతో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిసి ఉమ్మడి పరిశోధనలు నిర్వహిస్తున్నామని వివరించారు.
పట్టాల పండుగ: అనంతరం గవర్నర్ చేతుల మీదుగా మొత్తం 11,664 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఇందులో 64 మందికి పీహెచ్‌డీలు, 176 మందికి బంగారు పతకాలు, 1,194 మందికి పీజీ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ మధుమూర్తి, రిజిస్ట్రార్ ఇన్–ఛార్జ్ ప్రొఫెసర్ పి. పద్మ, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు, వర్సిటీ డీన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
డాక్టర్ కోట హరినారాయణకు డాక్టరేట్ ఇస్తున్న గవర్నర్
యోగివేమన యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరై మాట్లాడుతున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, విద్యార్థులు
గవర్నర్ చేతుల మీదుగా బంగారుపతకాలు, డాక్టరేట్ పట్టాలు పొందిన విద్యార్థులు
● రైతు బిడ్డకు మూడు పతకాలు
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలంకూరుకు చెందిన దేవారెడ్డి, సావిత్రిల కుమార్తె స్వర్ణకుమారి గణిత శాస్త్రంలో (M.Sc Maths) మూడు బంగారు పతకాలను సాధించి రికార్డు సృష్టించింది. పీజీలో అత్యధిక మార్కులు సాధించినందుకు ఒకటి, ఆల్‌రౌండర్ విభాగంలో మరొకటి, మ్యాథ్స్ డిపార్ట్‌మెంట్ విభాగంలో ఇంకొకటి చొప్పున పతకాలను అందుకుంది. తండ్రి వ్యవసాయం చేస్తూ ఆమెను ప్రోత్సహించగా, స్వర్ణకుమారి తన ప్రతిభతో తండ్రి కష్టానికి ఫలితాన్ని అందించింది.
కె.భారతి
పి. కీర్తి
వి. అంజలి
ఫసిహ బేగం
పి. హేమ వర్ధిని
ఈ. మౌనిక
కే. ప్రేమ్ దీప్
కే. మహేష్
గంగధర్ పాండవ
ఎం. సైరా బాను
గురులక్ష్మి కోలా
ఆర్.లక్షి ప్రవళిక
బి. పవన్ కుమార్
తస్లీమా
వైవీయూ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
వైవీయూ 11, 12, 13, 14వకాన్వొకేషన్ అత్యంత ఘనం
ఎల్‌సీఏ రూపశిల్పి కోట హరినారాయణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
పీఎం–ఉష కింద వర్సిటీకి రూ.20 కోట్ల నిధులు: వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్


