ఎత్తెకాఫ్‌.. ఏకాంత ఆరాధన | - | Sakshi
Sakshi News home page

ఎత్తెకాఫ్‌.. ఏకాంత ఆరాధన

Mar 14 2026 7:48 AM | Updated on Mar 14 2026 7:48 AM

రాజంపేట టౌన్‌ : రంజాన్‌ మాసంలో వచ్చే బడీరాత్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఎత్తెకాఫ్‌కు కూడా అంతే ఉంటుంది. రంజాన్‌ మాసంలో చివరి పదిరోజులు చాలా మంది ముస్లింలు ఎత్తెకాఫ్‌ను ఆచరిస్తారు. ఇదిలావుంటే మంగళవారం రాత్రి నుంచి జిల్లాలోని అనేక మసీదుల్లో ముస్లీం సోదరులు ఎత్తెకాఫ్‌ను పాటిస్తున్నారు. అల్లాహ్‌ ఇంటి (మసీదు) ఆతిథ్యం ఎత్తెకాఫ్‌ కల్పిస్తుందని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. రంజాన్‌ మాసంలో ఒక ఊరిలో ఒక వ్యక్తి కూడా ఎత్తెకాఫ్‌ ఉండకపోతే ఆ ఊరిపై నా కరుణ, ప్రేమాభిమానాలు ఉండవు అని పవిత్ర ఖురాన్‌లో అల్లాహ్‌ స్పష్టం చేశారు. ఇల్లు, కుటుంబం, వృత్తిని పక్కనపెట్టి వీలు పడినన్ని రోజులు (కనీసం 24 గంటలు) అయినా మసీదులో గడపడమే ఎత్తెకాఫ్‌. అన్నింటిని త్యాగం చేసి ఆధ్యాత్మికతతో ఉండే మనుషులపై అల్లాహ్‌ అత్యంత కరుణ చూపి మొరను ఆలకిస్తారని మౌల్వీలు చెబుతున్నారు. అయితే పెద్దతరహాలో ఉండే అనేక మంది పదిరోజుల పాటు ఎతె్‌ాత్కఫ్‌ను పాటించనున్నారు. ఈనెల 10వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమైన ఎత్తెకాఫ్‌ నెలవంక కనిపించేంత వరకు కొనసాగనుంది.

ఎత్తెకాఫ్‌ ఇలా..

ఎత్తెకాఫ్‌ ఉండాలంటే శుద్ధిస్నానం చేసి మసీదుకు వెళ్లి వజూ (ముఖం, చేతులు, కాళ్లను నీటితో శుద్ధి చేసుకోవడం) చేయాలి. ఎతె్‌ాత్కఫ్‌ నియ్యత్‌ను చదవాలి. ఇతరుల నుంచి భంగం లేకుండా మసీదులో డేరా ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండాలి. తహతుల్‌ వజూ, తహతుల్‌ మజీద్‌ల రెండేసి రకాత్‌ల నఫిల్‌ నమాజు చదవడం మంచిది. ఖురాన్‌ పఠనం, దువా, జికర్‌ ఇతర నమాజ్‌లు చేసుకోవాలి. మల, మూత్ర విసర్జన, వజూ, గుసూల్‌ స్నానం కోసం మాత్రమే డేరాల నుంచి బయటకు రావాలి. మసీదు గడపదాటరాదు. సహర్‌, ఇఫ్తార్‌, దావత్‌లు ఇస్తే స్వీకరించాలి. లేదా ఇంటి నుంచి భోజనం, ఆహార పదార్థాలు తెప్పించుకోవాలి. కలిమా ఏ తయ్యిబా లాయిలాహ ఇల్లల్లాహ్‌ ముహమ్మదూర్‌ రసూలల్లా (సొల్లెల్లాహు అలైహి వసల్లం), అస్తగ్‌ ఫిరల్లాహ్‌ బాగా పఠించాలి. సహరి కంటే ముందు 12 రకాతుల తహజూద్‌ (కనీసం రెండు రకాతులు) నమాజ్‌, సజ్‌దాలో దువా చేస్తే అల్లాహ్‌ సమీపం నుంచి మొర వింటారని ఖురాన్‌ బోధిస్తుంది. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల కష్ట సుఖాలతో పాటు సర్వమానవాళి సంక్షేమాన్ని కోరుతూ దువా చేస్తే ఉత్తమం. ఇఫ్తార్‌ సమయం నుంచి మరుసటి రోజు ఇఫ్తార్‌ వరకు ఒకరోజు అవుతుంది.మసీదులో అడుగు పెట్టగానే ‘బిస్మిల్లాహి దాఖల్తువ అలైహి తవక్కల్‌తు వనవైతు సున్నతుల్‌ ఎత్తెకాఫ్‌ నియ్యత్‌ చదవాలి.

నెలవంక కనిపించేంత వరకు మసీదుల్లోనే గడపనున్న పలువురు ముస్లింలు

మోక్షమార్గానికి అనువైన రోజులు

రంజాన్‌ మాసంలో చివరి పది రోజులు మోక్షమార్గానికి అనువైన రోజులు. ఎత్తెకాఫ్‌లో ఉన్న వారు కఠోర దీక్ష చేపట్టి ఖురాన్‌ను పఠించాలి. మసీదు గడప దాటకుండా అనుక్షణం అల్లాహ్‌ స్మరణలోనే ఉంటే తప్పక పుణ్యం, మోక్షం లభించడంతో పాటు ఏ పరిస్థితిలో ఉన్నా సాటి మానవుడి పట్ల ప్రేమాభిమానాలు చూపే గొప్ప మనస్తత్వం కలుగుతుంది.

– మౌలానా సాబిర్‌, ఇమామ్‌, అబుహురైరహ్‌ మస్జిద్‌, రాజంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement