
సాంభాల్: వివాహేతర సంబంధం కారణంగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని సాంభాల్‌లో మరో హత్యోందంతం వెలుగుచూసింది. నైతికత మరిచి వివాహేతర సంబంధం కొనసాగించడమే కాకుండా ప్రియుడ్ని పక్కా పథకం ప్రకారం అడ్డు తొలగించుకునే యత్నం చేసింది ఓ మహిళ, ఆ వ్యక్తిని ఇంటికి పిలిచి స్క్రూ డ్రైవర్, ;పట్టకారు సాయంతో హత్య చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. 45 ఏళ్ల అనిష్ అనే వ్యక్తికి సితార అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలోనే అతని వద్ద నుంచి రూ. 7 లక్షలను సితార తీసుకుంది. ఆ సొమ్మును ఇవ్వాలని అనిష్ పదే పదే అడగడంతో సితార ప్రణాళిక రచించింది. అప్పు తీసుకున్న విషయం భర్త రాయిస్ అహ్మద్‌కు కూడా తెలిసినదే కావడంతో హత్యా రచన అనేది ఇద్దరూ కలిసే చేశారు. ఈ క్రమంలోనే అనిష్‌ను ఇంటికి పిలిచింది సితార. ఇంటికి వచ్చిన తర్వాత అతన్ని కట్టేసి స్క్రూ డ్రైవర్, ఇంటిలోని ఇతర వస్తువుల సాయంతో అనిష్‌ను హత్య చేశారు.
వివాహేతర సంబంధమే కారణం..
ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆమె ఇంటికి తరుచు వస్తూ పోతూ ఉండే అనిష్‌ను అడ్డు తొలగించుకోవాలని సితార భావించింది. దీనిలో భాగంగానే ఇంటికి పిలిచి హత్య చేసినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అయితే పూర్తి స్థాయి విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అడిషనల్ ఎస్పీ రాజేశ్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రస్తుతం అనిష్ హత్య కేసులో నిందితులుగా ఉన్న భార్యా భర్తల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.
రూ. 7 లక్షలు తిరిగి ఇవ్వమని అడిగినందుకే..
అయితే అనిష్ కుటుంబ సభ్యులు మాత్రం సితారతో వివాహేతర సంబంధం గురించి తమకు తెలియదని అంటున్నారు. ఆమె తమకు తెలుసున్న వ్యక్తి అని, ఆ క్రమంలోనే అనిష్ వద్ద నుంచి రూ. 7 లక్షలను అప్పుగా తీసుకుందని అంటున్నారు. ఆ డబ్బు తిరిగి ఇమ్మని అడిగినందుకే తన కుమారుడు అనిష్‌ను పొట్టనపెట్టుకున్నారని తండ్రి ముస్తకిమ్ తెలిపారు. చాలా దారుణంగా తన తనయుడ్ని హత్య చేశారని, డబ్బులు అడిగినందుకే ఇంత ఘోరానికి ఒడిగట్టారని, అంతకుమించి తనకు తెలియదని తండ్రి తెలిపారు. తన కుమారుడి పెళ్లి ఫిక్స్ అయ్యిందని, ఈ క్రమంలోనే ఇచ్చిన అప్పును అడగడానికి వెళుతున్నట్లు తమకు చెప్పాడని తండ్రి ముస్తకిమ్ తెలిపారు.