సాక్షి,విజయవాడ: ఐఏఎస్ అధికారి కిషోర్ సతీమణి సత్య దీపిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం చర్చాంశనీయంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత కొన్ని రోజులుగా ఐఏఎస్ అధికారి కిషోర్ భార్య సత్య దీపిక గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గత వారం ఐఏఎస్ అధికారి కిషోర్ తన భార్యను ఆయుష్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే,ఈ ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు.
సత్య దీపిక మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సత్యదీపిక మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు కూడా సేకరిస్తున్నారు.


