పోలీసులపై దాడి.. ఇద్దరు రిపోర్టర్లు అరెస్ట్‌ | Two Reporters Arrested In Assault Case | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో పోలీస్‌లపై దాడి

Aug 27 2020 9:11 AM | Updated on Aug 27 2020 9:11 AM

Two Reporters Arrested In Assault Case - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న డీసీపీ (క్రైం) సురేష్‌బాబు

సాక్షి, విశాఖపట్నం: విధి నిర్వాహణలో ఉన్న పోలీస్‌ సిబ్బందిపై మద్యం మత్తులో దౌర్జన్యానికి పాల్పడిన ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించామని డీసీపీ (క్రైం) సురేష్‌బాబు తెలిపారు. హార్బర్‌ పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం సాయంత్రం గోవిందరావు (45), రమణారావు (43) మద్యం సేవించి వేగంగా గాజువాక నుంచి కాన్వెంట్‌ కూడలి వైపు వస్తున్నారు. కాన్వెంట్‌ కూడలి వద్ద సిగ్నల్‌ పడడంతో వాహనాలు నిలిపి ఉండగా... వేగంగా వస్తున్న వీరిద్దరూ ఆగి ఉన్న కారును ఢీకొట్టారు.

దీంతో ఆ కూడలిలో విధుల్లో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్, హోంగార్డు రవి సంఘటన స్థలానికి వెళ్లి కారును ఎందుకు గుద్దారని ప్రశ్నించారు. దీంతో వారిద్దరిపై గోవిందరావు, రమణారావు దాడి చేసి దుర్భాషలాడారు. ఒకరు పీపుల్‌ వాయిస్‌ రిపోర్టర్‌ని అని, మరో వ్యక్తి మహాన్యూస్‌ రిపోర్టర్‌ని అని చెప్పారు. దీంతో వారిద్దరిపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించామని సురేష్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో ఏడీసీపీ (ట్రాఫిక్‌) ఆదినారాయణ, ఏసీపీలు ఎంఆర్‌కే రాజు, టి.మోహన్‌రావు, సీఐ శ్యామలారావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement