తెలుసుకుందాం
పోలీసులు గుంపులను చెదరగొట్టడానికి వాడే ‘టియర్ గ్యాస్’ నిజానికి గ్యాస్ కాదు. అది ఒక రకమైన రసాయన పొడి. దీనిని చిన్న చిన్న గ్రెనేడ్లు లేదా షెల్స్ రూపంలో గాల్లోకి కాలుస్తారు. అలా కాల్చినప్పుడు అది గాల్లో కలిసిపోయి దట్టమైన పొగలాగా మారుతుంది. ఇందులో ఎక్కువగా ’సీఎస్’ అనే కెమికల్‌ను ఉపయోగిస్తారు. ఈ పొగ మన ముఖానికి తగలగానే, అందులోని రసాయనాలు మన కళ్లు, ముక్కు, నోరు, ఊపిరితిత్తులలో ఉండే తేమ తో చర్య జరుపుతాయి.
ముఖ్యంగా మన కళ్లల్లో ఉండే నరాలను ఇది తీవ్రంగా ఉత్తేజపరుస్తుంది. దాంతో కళ్లు విపరీతంగా మంటలు పుట్టి, ప్రాణం విలవిల్లాడిపోతుంది. ఆ మంట నుంచి కళ్లను కాపాడుకోవడానికి మన మెదడు వెంటనే స్పందించి, కళ్లల్లోంచి కన్నీళ్లను వరదలా పారేలా చేస్తుంది. అందుకే దీనికి ‘బాష్పవాయువు’ అని పేరు వచ్చింది. దీనివల్ల కళ్లు తాత్కాలికం గా మూతపడతాయి, ముక్కు కారుతుంది, విపరీతంగా దగ్గు వస్తుంది.
అయితే ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. ఆ పొగ నుంచి దూరంగా జరిగి, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ, కళ్లను మంచి చల్లటి నీటితో కడుక్కుంటే ఓ 15 నుంచి 20 నిమిషాల్లో దీని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. శాంతిభద్రతలను కాపాడటానికి, ఎవరికీ పెద్దగా గాయాలు అవ్వకుండా గుంపులను కంట్రోల్ చేయడానికి పోలీసులు వాడే ఒక సైన్స్ ట్రిక్ ఇది!


