గొర్రెల కేసులో మరో ఇద్దరు అరెస్టు | Sakshi
Sakshi News home page

గొర్రెల కేసులో మరో ఇద్దరు అరెస్టు

Published Fri, Mar 15 2024 3:02 AM

Two more arrested in sheep case - Sakshi

జేడీ అంజిలప్ప, ఏడీ కృష్ణయ్యను అరెస్టు చేసిన ఏసీబీ

తప్పుడు పత్రాలు కలెక్టర్లకు పంపి, నిధులు మంజూరు చేయించిన నిందితులు

సాక్షి, హైదరాబాద్‌: గొర్రెల కొనుగోలు పథకం నిధుల గోల్‌మాల్‌ కుంభకోణంలో ఏసీబీ అధికారులు మరో ఇద్దరు పశుసంవర్ధకశాఖ అధికారులను అరెస్టు చేశారు. పశుసంవర్థకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డా.అంజిలప్ప, పశుసంవర్థక శాఖ రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా.పి.కృష్ణయ్యను అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

గొర్రెలు కొనకుండానే ఈ ఇద్దరు అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కలిసి గొర్రెలు విక్రయించిన రైతులు అంటూ నకిలీ రైతుల పేరిట ధ్రువపత్రాలను కలెక్టర్లకు సమర్పించినట్టు వెల్లడించారు. ఇలా నకిలీ రైతులకు కలెక్టర్ల నుంచి డబ్బులు కూడా మంజూరు చేయించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇద్దరు నిందితులను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చినట్టు పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే ఆరుగురు అధికారులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అంతా అడ్డగోలు వ్యవహారమే.. 
అరెస్టయిన ఇద్దరు అధికారులు అంజిలప్ప, పి.కృష్ణయ్య గొర్రెల కొనుగోలుకు సంబంధించిన నిబంధనలను పూర్తిగా తుంగలోతొక్కి ప్రైవేటు వ్యక్తుల చేతికి కొనుగోలు వ్యవహారాన్ని అప్పగించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. గొర్రెల కొనుగోలుకు వెళ్లిన అధికారులు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు సైతం ప్రైవేటు వ్యక్తులు చెప్పినట్టు వినాలని సదరు అధికారులు ఆదేశించినట్టు గుర్తించారు.

గొర్రెలు విక్రయించేది ఎవరు అన్నది చూడకుండానే ప్రైవేటు వ్యక్తులు చెప్పినట్టుగా గొర్రెలను కొనడం, ప్రభుత్వ అధికారులు నింపాల్సిన ధ్రువపత్రాలను సైతం ప్రైవేటు వ్యక్తులే నింపడం, గొర్రెలను కొనుగోలు చేయకుండానే నకిలీ పత్రాలు సృష్టించి వాటిని పశుసంవర్థకశాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడం..ఇలా నిందితులిద్దరు అడ్డగోలుగా వ్యవహరించినట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

మొత్తం రూ.2.10 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడంలో ఈ ఇద్దరు అధికారులది కీలకపాత్ర అని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. 

Advertisement
 
Advertisement