సాక్షి, వరంగల్ హనుమకొండ కలెక్టరేట్ భవన సముదాయంలో అడ్డంగా దొరికిన అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ దాడులు ఆగడం లేదు. వెంకట్‌రెడ్డితోపాటు మరో ఇద్దరినీ అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచి ఖమ్మం జైలుకు తరలించారు. ఇంతటితో కథ ముగిసిందని భావిస్తున్న సమయంలో బుధవారం రంగారెడ్డి, మిర్యాలగూడ జిల్లాల్లో మళ్లీ ఏసీబీ సోదాలు నిర్వహించడం కలకలంగా మారింది.
ఆ ఉద్యోగి ఇచి్చన సమాచారంతోనే...
సివిల్ సప్లయీస్ విభాగంలో జరిగిన భారీ అక్రమాలే ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది. అన్నీ తానై వ్యవహరించిన ఓ కిందిస్థాయి ఉద్యోగిని అప్రూవర్‌గా మారినట్టు సమాచారం. అడిషనల్ కలెక్టర్ తాను పనిచేసిన ప్రాంతాల్లో ఉద్యోగం చేసిన సదరు ఉద్యోగినిని తాను హనుమకొండకు వచ్చాకే తీసుకొచి్చనట్టు సమాచారం. సదరు ఉద్యోగినిని వెంకట్‌రెడ్డిపై ఏసీబీ కేసు అయ్యాక హనుమకొండ నుంచి బదిలీ చేశారు. ఆ తర్వాత ఆ ఉద్యోగినే అప్రూవర్‌గా మారి ఇచి్చన సమాచారం ఆధారంగా ఏసీబీ మరిన్ని అక్రమాస్తులనుగుర్తించినట్టు చెబుతున్నారు.
పౌర సరఫరాల శాఖలో విచ్చలవిడితనం
రెవెన్యూశాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకట్‌రెడ్డి.. అడిషనల్ కలెక్టర్‌గా పౌర సరఫరాల శాఖలో విచ్చలవిడితనాన్ని ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. జనగామ ఆర్డీఓగా, సూర్యాపేట అడిషనల్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలోనూ ఈయనపై భూ సేకరణలో భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. భువనగిరి–వరంగల్ 563 జాతీయ రహదారి భూసేకరణ సందర్భంగా అక్రమాలపై ఫిర్యాదులున్నాయి. అడిషనల్ కలెక్టర్‌గా హనుమకొండలో బాధ్యతలు చేపట్టిన తర్వాత కమలాపూర్ మండలంలో రెండు రైస్‌మిల్లులు నడుపుతున్న హసన్‌పర్తికి చెందిన ఓ వ్యాపారికి రూ.16 కోట్ల విలువైన ధాన్యాన్ని కేటాయించడం మిల్లర్లలో హాట్ టాపిక్‌గా ఉంది. ఇలా చాలామందికి సీఎంఆర్ ఇవ్వడంలో రూ.లక్షలు చేతులు మారినట్టు ఆరోపణలు ఉన్నాయి. భూ సేకరణ చెల్లింపుల్లో లెక్క లేనన్ని అక్రమాలు ఉన్నట్టు ఉప్పందుకున్న ఏసీబీ... తాజాగా మళ్లీ సోదాలు, దాడులు చేసినట్టు చర్చ జరుగుతోంది. జనగామ జిల్లా నెల్లుట్ల ఏరియాలో బినామీ పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్ చేస్తున్న దానిపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టు కూడా చెబుతున్నారు.
మూడు చోట్ల సోదాలు
ఎల్‌బీనగర్‌లోని నాగోలు డివిజన్ పరిధి రాక్‌టౌన్‌కాలనీలో వరంగల్ ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రాధేశ్ మురళి ఆధ్వర్యంలో 8 మంది అధికారుల బృందం బుధవారం తెల్లవారుజామున వెంకట్‌రెడ్డి నివాసంలో సోదాలు చేసింది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సాయి రెసిడెన్సీలో వెంకట్‌రెడ్డి బంధువుల ఇంటితోపాటు మిర్యాలగూడ మండలం దొండవారిగూడెం గ్రామంలోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. సోదాలకు సంబంధించి వివరాలు అధికారులు వెల్లడించలేదు.
హనుమకొండ చైతన్యపురిలో గతంలో ఆయన అద్దెకున్న ఇంటిలో సోదాలు చేసేందుకు రాగా, అప్పటికే ఇల్లు ఖాళీ చేసినట్టు యజమాని చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.
రూ.7,69,38,332 ఆస్తుల సీజ్
పాఠశాలకు అనుమతి విషయంలో గత నెల రూ.60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి సస్పెండ్ అయిన అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఇల్లుతోపాటు బంధువుల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. స్థిర, చర ఆస్తులతో కలిపి దాదాపు రూ.7,69,38,332 ఆస్తులను సీజ్ చేశారు. ఈ మేరకు అధికారులు ఆ వివరాలు మీడియాకు వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో పలుచోట్ల బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. వెంకట్‌రెడ్డి ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో దాదాపు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. వెంకట్‌రెడ్డి ఇల్లుతోపాటు అతని బంధువులకు చెందిన ఇళ్లల్లో ఏడు చోట్ల బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఆయనతోపాటు కుటుంబసభ్యుల పేర్లపై ఉన్న పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రిజి్రస్టేషన్ విలువ ప్రకారం అందులో రూ.4.65 కోట్ల రెండు ఇళ్లు (విల్లా, ఫ్లాట్), రూ.60 లక్షల గల వాణిజ్య దుకాణం, రూ.65 లక్షల విలువ గల 8 ప్లాట్లు, రూ.50 లక్షల విలువైన 14.25 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీటితోపాటు రూ.30,00,300 నగదు, రూ.44,03,032 బ్యాంక్ బ్యాలెన్స్, రూ.11 లక్షల గృహోపకరణాలు, రూ.40 లక్షల నాలుగు కార్లు, 297 గ్రాముల బంగారం సీజ్ చేసినట్టు చెప్పారు.


