అడ్డూ అదుపు లేకుండా దాడులు | Tdp attacks across the state | Sakshi
Sakshi News home page

అడ్డూ అదుపు లేకుండా దాడులు

Jul 19 2024 5:50 AM | Updated on Jul 19 2024 6:07 AM

Tdp attacks across the state

దాడులు, దౌర్జన్యాలు 1,050

టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అడ్డూ అదుపు లేకుండా దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ అరాచకాలకు మంత్రి లోకేశ్‌ నియోజకవర్గం మంగళగిరి కేంద్ర బిందువుగా మారింది.పెదవడ్లపూడికి చెందిన పాలేటి రాజ్‌కుమార్‌ను లోకేశ్‌ అనుచరులు కిడ్నాప్‌ చేసి చిత్రహింసలకు గురిచేశారు. మోకాళ్లపై కూర్చుని లోకేశ్‌ చిత్రపటానికి దండం పెడుతూ క్షమాపణలు చెప్పకపోతేహతమారుస్తామని హెచ్చరించారు.

ప్రాణభయంతో రాజ్‌కుమార్‌ వారు చెప్పినట్టు చేశారు. దీన్ని టీడీపీ నేతలు వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. లోకేశ్‌ నియోజకవర్గాన్ని ఆయన సొంత జిల్లా చిత్తూరు టీడీపీ నేతలు ఆదర్శంగా తీసుకున్నారు. చిత్తూరులో రాజు అనే యువకుడిని కిడ్నాప్‌ చేసి గుర్తుతెలియని ప్రాంతానికితీసుకువెళ్లి కర్రలు, రాడ్లతో తీవ్రంగా దాడి చేశారు. ఆ దాడిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. 

వారికి తామేమీ తక్కువ కాదన్నట్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ అనుచరులు సైతం ఇటీవల ఓ వ్యక్తిని కిడ్నాప్‌ చేసి దారుణంగా కొట్టారు. విజయవాడలో టీడీపీ గూండాలు ఏకంగా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి మరీ మద్దెల పవన్‌ అనే వ్యక్తిపై బీరు సీసాలతో దాడి చేశారు. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం వేల్చూరులోని ఎస్సీ కాలనీపై 50మందికి పైగా టీడీపీ గుండాలు దాడి చేశారు. ఇలా 40 రోజుల్లో 1,050 వరకు దాడులు, దౌర్జన్యాలు జరిగాయి.  

ఇళ్లు నేలమట్టం.. కార్యాలయాలు ధ్వంసం  
560 ప్రైవేట్‌ ఆస్తుల ధ్వంసం 
వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారనే అక్కసుతో పేదల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో 40మంది పేదల ఇళ్లను కూల్చివేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 16 జిల్లాల్లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో చీనీ తోటలను నరికేస్తున్నారు. వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి, అనంతరపురం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో టీడీపీ గుండాల దాడులతో స్వైర విహారం చేస్తున్నారు. 

ప్రధానంగా సర్పంచిలు, స్థానిక సంస్థల ప్రతినిధులను, వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. వాహనాలను దహనం చేస్తున్నారు. ఇలా 560 వరకు ప్రైవేట్‌ ఆస్తులను ధ్వంసం చేశారు. వీటిలో ఒక్క చిత్తూరు జిల్లాలో 100 ఘటనలు జరిగాయి.

భయంతో బతకలేక.. వలసబాట
ఊరు వదిలి వెళ్లినకుటుంబాలు 2,700
టీడీపీ రౌడీమూకలు దండెత్తుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో కన్నతల్లి వంటి సొంత ఊరును వదిలి వలసవెళ్లిపోతున్నారు. పొరుగు రాష్ట్రంతోపాటు అటవీ ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. 

చిత్తూరు జిల్లాలో దాదాపు 500 కుటుంబాలు, అనంతపురం జిల్లాలో 350 కుటుంబాలు, శ్రీసత్యసాయి జిల్లాల్లో 100, అన్నమయ్య జిల్లాలో 120 కుటుంబాలు, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ గ్రామాలను వదిలి వలసవెళ్లాయి. వలస వెళ్లిన కుటుంబాల పంటలను, ఆస్తులను సైతం టీడీపీ మూకలు ధ్వంసం చేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 2,700 కుటుంబాలు ప్రాణభయంతో వలస వెళ్లాయి. 

విగ్రహాలపైనా అక్కసు 
468 వైఎస్సార్‌ విగ్రహాలుధ్వంసం 
దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాలపైనా టీడీపీ మూకలు తమ అక్కసు వెళ్లగక్కుతున్నాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో తమకు జరిగిన మేలును తలచుకుంటూ అన్ని అనుమతులతో ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటుచేసుకున్న విగ్రహాలను సైతం అడ్డగోలుగా కూల్చివేస్తున్నారు. 

పెట్రోల్‌ పోసి నిప్పు పెడుతున్నారు. వైఎస్సార్‌ విగ్రహాల చేతులు, కాళ్లు, తల, ముక్కు.. ఇలా ఒక్కో భాగాన్ని ముక్కలుముక్కలుగా చేసి తాలిబన్ల తరహాలో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇప్పటి వరకు అన్ని జిల్లాల్లో కలిపి 468 విగ్రహాల వరకు వైఎస్సార్‌ విగ్రహాలను ధ్వంసం చేశారు. 
 

జగన్‌ జాడ ఉండకూడదని..
2,260 శిలాఫలకాలు ధ్వంసం
దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా 2019లో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటుచేశారు. వాటిలో 1,35,819 మంది ఉద్యోగులను, 2.66లక్షల మంది వలంటీర్లను నియమించారు. అన్ని ప్రభుత్వ సేవలను ప్రజలకు తమ ఇంటి వద్దకే చేర్చారు. ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తు నుంచి పంట విక్రయం వరకు అన్ని సేవలను చేరువచేశారు. 

విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా గ్రామీణ ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. నాడు–నేడు ద్వారా పాడుబడిన పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలా పాలనలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌ పాలన గురుతులను చేరిపివేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు.

సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు వంటి భవనాల వద్ద ఉన్న శిలాఫలకాలు, నవరత్నాలు బోర్డులను ఘోరంగా ధ్వంసం చేస్తున్నారు. రోడ్ల అభివృద్ధి శిలాఫలకాలను సైతం కూలి్చస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,260 వరకు శిలాఫలకాలను నేలమట్టం చేశారు.

ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం
 490 ప్రభుత్వఆస్తుల ధ్వంసం  
ఎన్నడూలేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం కొనసాగుతోంది. ప్రతి జిల్లాలో జూన్‌ 4వ తేదీ తర్వాత నిత్యం గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలపై పచ్చముఠాలు దాడులు చేసి ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తద్వారా ఇక తమకు గ్రామాల్లో ఎదురులేదని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయినా పోలీసులు పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు కేవలం 40 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. తిరుపతి జిల్లాలో అత్యధికంగా 52 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 

పత్రికా స్వేచ్ఛపైనా దాడి 
టీడీపీ అరాచకాలతో రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ కూడా ప్రమాదంలో పడింది. ఎన్నికల హామీని టీడీపీ తుంగలో తొక్కి విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు చంద్రబాబు ప్రభుత్వం మద్దతు ఇస్తున్న విషయాన్ని ప్రచురించిన డెక్కన్‌ క్రానికల్‌ పత్రిక కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారు. 

విశాఖపట్నంలోని డెక్కన్‌క్రానికల్‌ కార్యాలయం బోర్డులు తగలబెట్టి బీభత్సం సృష్టించారు. ఇక నుంచి ఎవరైనా తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఇలానే ఉంటుందనే తరహాలో హెచ్చరికలు జారీచేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచి్చన 40 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని జాతీయస్థాయిలో మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

ఠాణా..తందానా! 
బీఆర్‌ అంబేడ్కర్‌ అందించిన భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిన పోలీసు శాఖ... లోకేశ్‌ విరచిత రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి దాసోహమైంది. రెడ్‌బుక్‌ పేరిట రాష్ట్రంలో హోర్డింగులు పెట్టి మరీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసు శాఖ కళ్లుండీ కబోదిగా వ్యవహరిస్తోంది. రెడ్‌బుక్‌ రాజ్యాంగానికి సెల్యూట్‌ చేస్తూ టీడీపీ అరాచకాలకు గొడుగుపడుతోంది. రాష్ట్రస్థాయిలో లోకేశ్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరిట అరాచకానికి తెరతీస్తే... నియోజకవర్గ స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తలో రెడ్‌బుక్‌ను తెరపైకి తెచ్చి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. 

తమ దౌర్జన్యాలకు అడ్డువస్తే పోలీసుల సంగతి తేలుస్తామని టీడీపీ ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ప్రకటిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పూర్తిగా అదుపు తప్పిన శాంతిభద్రతలు మున్ముందు మరింతగా దిగజారుతాయని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement