సెక్యూరిటీ గార్డ్‌ టు సైబర్‌ క్రిమినల్‌!

Security Guard Turns To Cyber Criminal In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నేపాల్‌ నుంచి బతుకుదెరువు కోసం వచ్చి బెంగళూరులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న అర్జున్‌ బోర సైబర్‌ నేరగాడిగా మారాడు. తన సోదరుడితో పాటు నాగరాజు అనే వ్యక్తితో కలిసి బ్లాక్‌ ఫంగస్‌ మందులు విక్రయిస్తామంటూ ఎర వేసి మోసం చేయడంతో సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో పట్టుకున్న ఇతడిని పీటీ వారెంట్‌పై బుధవారం సిటీకి తరలించారు.

నగరానికి చెందిన ధనుంజయ్‌ తండ్రి బ్లాక్‌ ఫంగస్‌ బారినపడ్డారు. దీని చికిత్సకు వాడే ఇంజెక్షన్ల కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో కొందరు పరిచయస్తులు   బెంగళూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు. ధనుంజయ్‌ ఆ నంబర్‌లో సంప్రదించగా... రూ.1.29 లక్షలకు ఇంజెక్షన్లు సరఫరా చేయడానికి అంగీకరించాడు. ఇందులో రూ.20 వేలు అర్జున్‌ ఖాతాకు, మిగిలిన మొత్తం నాగరాజు ఖాతాకు బదిలీ చేయించారు.

ఆపై వారి నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన ధనుంజయ్‌ సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితులు బెంగళూరులో  ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం అర్జున్‌ను అరెస్టు చేసింది. పరారీలో ఉన్న ఇతడి సోదరుడితో పాటు నాగరాజు కోసం గాలిస్తోంది.
చదవండి: ‘జోతిష్యుడి’ కథ అడ్డం తిరిగింది! 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top