‘జోతిష్యుడి’ కథ అడ్డం తిరిగింది! 

Fake Currency: Notes Exchange Fraud Astrologer Gang Arrested - Sakshi

నాగోలు: జోతిష్యం తెలుసంటూ కలరింగ్‌ ఇచ్చి ఆ ముసుగులో నకిలీ రంగురాళ్లు అంటగట్టడంతో పాటు హవాలా దందా, నకిలీ నోట్ల చెలామణి చేపట్టాడో బోగస్‌ జోతిష్యుడు. ఈ విషయం తెలియని పని వాడు మరికొందరితో కలిసి ఫేక్‌ కరెన్సీ ఎత్తుకుపోయాడు. ఇది కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో అతగాడు విలువైన రంగురాళ్లు, వజ్రాలు పోయాయంటూ కేసు పెట్టాడు.

రంగంలోకి దిగిన ఎల్బీనగర్‌ సీసీఎస్‌ పోలీసుల దర్యాప్తులో అసలు వ్యవహారం బయటపడింది. జోతిష్యుడితో సహా ఏడుగురిని అరెస్టు చేసిన అధికారులు రూ.17.72 కోట్ల టాయ్‌ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ క్రైమ్స్‌ డీసీపీ యాదగిరి పూర్తి వివరాలు వెల్లడించారు.  

జోతిష్యుడి అవతారంలో మోసాలు... 
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుళ్ళపల్లికి చెందిన బెల్లంకొండ మురళీకృష్ణ శర్మ పదో తరగతి వరకు చదివాడు. ఆపై జోతిష్యుడి అవతారం ఎత్తి మాయమాటలతో ఎదుటి వారిని తేలిగ్గా మోసం చేయడం మొదలెట్టాడు. ఈ ముసుగులో నకిలీ రంగురాళ్ళను అంటగట్టి అమాయకులను బురిడి కొ ట్టించి రూ.లక్షల్లో ఆర్జించాడు. 2006లో కుటుంబంతో వెళ్లి విజయవాడలో స్థిరపడ్డారు. అక్కడ ఉంటూ భక్తి నిధి పేరుతో ఓ వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసిన నకిలీ రంగురాళ్ళు అమ్మాడు. ఈ మోసాలతో అనుకున్న స్థాయిలో ధనార్జన సాధ్యం కాలేదు. దీంతో విలాసా ల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. 
 
గతంలో కటకటాల్లోకి పంపిన సీబీఐ.. 
మురళీకృష్ణకు 2019లో నూరుద్దీన్‌ అనే వ్యక్తి ఇతడికి పరిచయమయ్యాడు. అతడు ట్రేడింగ్‌  చేస్తుండటంతో అందులో పెట్టుబడి పెట్టేందుకు తన బ్యాంకు ఖాతాలో రూ.90 కోట్లు ఉన్నట్లు నమ్మించాడు. ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు మల్కాజ్‌గిరిలో ఓ బ్యాంక్‌ అధికారుల సాయం తీసుకున్నాడు. తాత్కాలిక ప్రాతిపదికన తనకు ఆ నగదు తన ఖాతాలో ఏర్పాటు చూస్తే..24 గంటల్లో ఖరీదు చేసిన షేర్లు అమ్మేసి లాభాలు పంచుకుందామని ఎర వేశాడు.  ఆ స్కామ్‌ను ముందే బ్యాంకు ఉన్నతాధికారులు గుర్తించారు. సీబీఐకు ఫిర్యాదు చేయగా మురళీకృష్ణతోపాటు కొందరు బ్యాంకువారిని అరెస్టు చేశారు.

జైలు నుంచి వచ్చి కొత్త దందాలు... 
ఈ కేసులో బెయిల్‌ పొందిన మురళీకృష్ణ తన మకాంను నాగోల్‌ పరిధిలోని బండ్లగూడకు మార్చాడు. జూబ్లీహిల్స్‌లో మరో ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నాడు. జోతిష్యం, సమస్యల పరిష్కారం పేరుతో వివిధ ఛానళ్లలో ప్రకటనలు ఇచ్చి çఆకర్షితులైన వారికి నకిలీ రంగురాళ్లు విక్రయిస్తున్నాడు. దీంతో పాటు నలుగురు అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో నకిలీ నోట్ల చెలామణి చేపట్టాడు. 

ఆ కట్టుకథతో దొరికిపోయాడు..
ఈ నకిలీ జోతిష్యుడి వద్ద పని చేసే గుంటూరుకు చెందిన సి.నాగేంద్రప్రసాద్‌ శర్మ, వేల్పూరి పవన్‌ కుమార్, దొండపాటి రామకృష్ణ, చందులూరి విజయ్‌ కుమార్, కంభంపాటి సూర్యం,  చందులూరి నాగేంద్రలకు దుర్భుద్ది పుట్టింది. ఈ నెల 14న వీరంతా కలిసి మురళీకృష్ణ ఇంట్లో నగదు ఉన్న బ్యాగ్‌ చోరీ చేశారు. దాన్ని తీసుకుని కారులో గుంటూరు జిల్లాకు వెళ్తున్న వీళ్లు మార్గ మధ్యంలో బ్యాగ్‌ తెరిచి చూశారు. బ్యాగ్‌లో ఉన్న వాటిలో కేవలం రూ.2 వేల నోట్లు 16 మాత్రమే అసలైనవి అని, మిగిలినవి నకిలీ కరెన్సీ, టాయ్‌ కరెన్సీగా గుర్తించారు.

అవి తమ వద్ద ఉంటే పోలీసులు పట్టుకుంటారని భయపడిన ఆ నిందితులు నార్కట్‌పల్లి వద్ద ప్రధాన రోడ్డు దూరంగా తీసుకువెళ్లి పెట్రోల్‌ పోసి కాల్చేశారు. ఈ చోరీని తనకు అనుకూలంగా మార్చుకుని క్యాష్‌ చేసుకోవాలని భావించిన మురళీకృష్ణ తన ఇంటి నుంచి రూ.40 లక్షల విలువైన రంగురాళ్లు, వజ్రాలు చోరీ అయ్యాయని ఎల్బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు లోతుగా దర్యాప్తు చేశారు. 

అసలు విషయం చెప్పిన ఆరుగురు 
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎల్బీనగర్‌ సీసీఎస్‌ పోలీసులు పిగుడురాళ్ల వెళ్లి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి విచారణలో చోరీ చేసిన నకిలీ నోట్లు, వాటిని కాల్చేయడం తదితర విషయాలు బయటపడ్డాయి. నకిలీ నోట్లు జోతిష్యుడి వద్దకు ఎలా వచ్చాయనే అనుమానంతో పోలీసులు అతడినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మురళీకృష్ణ హవాలా దందా, టాయ్‌ కరెన్సీతో మోసాలు, నకిలీ కరెన్సీ చెలామణి తదితరాలు బయటపెట్టాడు. దీంతో అతడి ఇంటిపై దాడి చేసిన పోలీసులు రూ.రూ.17.72 కోట్ల టాయ్‌ కరెన్సీ, రూ.6 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. మురళీకృష్ణతో పాటు ఏడుగురు నిందితుల్నీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
చదవండి: 'ఆ రూపాయి నాణేం కోటికి కొంటాను'

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top