ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలనాలు | Shocking Facts Revealed In The Remand Report Of Praneeth Rao Phone Tapping Case, Details Inside - Sakshi
Sakshi News home page

ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలనాలు

Mar 24 2024 8:08 PM | Updated on Mar 25 2024 11:24 AM

Praneeth Rao Case: Key Facts Of The Remand Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్‌, భుజంగరావు, తిరుపతన్న రిమాండ్‌ రిపోర్ట్‌ బహిర్గతమైంది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు చెబితేనే చేశామని ప్రణీత్‌, భుజంగరావు, తిరుపతన్న తెలిపారు. 7 రోజుల విచారణలో ప్రణీత్‌రావు కీలక విషయాలు బయటపెట్టారు.

కాగా, ఈ కేసులో ప్రభాకర్‌రావును ఏ1గా పోలీసులు చేర్చారు. ఏ1 ప్రభాకర్‌రావు, ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 రాధాకిషన్, ఏ4 భుజంగరావు, ఏ5 తిరుపతన్న, ఏ6 ప్రైవేట్ వ్యక్తి పేరును పోలీసులు చేర్చారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌రావే కీలక సూత్రధారిగా తేలింది. ప్రభాకర్‌రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు నిర్థారించారు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్‌లను ప్రణీత్‌రావు ధ్వంసం చేశాడు. ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన హార్డ్‌ డిస్క్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్‌ను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

రిమాండ్‌ రిపోర్ట్‌లో ఏముంది?
భుజంగరావు, తిరపతన్న ఇచ్చిన నెంబర్లను ప్రణీత్‌ ట్యాప్‌ చేశారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు, వారి కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాప్‌ చేశానని, రాజకీయ నేతలు కదలికలు, నిధుల సమీకరణపై దృష్టిపెట్టానని ప్రణీత్‌రావు వెల్లడించాడు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న వారి ఫోన్లను కూడా టాప్ చేశాం. ట్యాపింగ్‌ సంబంధించిన మెయిన్ డివైజ్‌ని పూర్తిగా ధ్వంసం చేశాను. 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్‌లు అన్నిటిని ధ్వంసం చేశాను. హార్డ్ డిస్కులు ప్రధాన డివైజ్‌ని కట్టర్‌తో ముక్కలు ముక్కలుగా కట్ చేశాం. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్‌లు, డివైజ్‌లు తీసుకువెళ్లి మూసీ నదిలో పడవేశాం. రెండు లాకర్‌ రూములలో ఉన్న డాక్యుమెంట్లు అన్నిటిని తగలబెట్టామని ప్రణీత రావు వెల్లడించాడు.

బీఆర్‌ఎస్‌ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్‌చేశానని.. ప్రణీత్‌ ఇచ్చిన సమాచారాన్ని బీఆర్‌ఎస్‌ కీలక నేతకు చేరవేశామని భుజంగరావు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను కుటుంబ సభ్యుల నెంబర్లను టాప్ చేశామని తెలిపారు.

మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు ఇచ్చే నంబర్లను ప్రణీత్‌కి ఇచ్చానని తిరుపతన్న వెల్లడించారు. హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీ షేర్ చేశాడు. డీసీపీ చెప్పిన నంబర్లతో పాటు కొంతమంది కదలికలను ట్రాక్ చేశామని తిరుపతన్న తెలిపారు.

ఇదీ చదవండి: ఫోన్‌ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్‌రావే కీలక సూత్రధారి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement