భార్యపై అనుమానం.. మిత్రుడితో ఒప్పందం కుదుర్చుకుని..

Murder Attempt On Wife Main Accused Husband Extra Marital Affair Hyderabad - Sakshi

రూ.7 లక్షల సుపారికి మిత్రుడితో ఒప్పందం  

కీలకంగా మారిన సీసీ కెమెరాల ఫుటేజీ

సాక్షి,సనత్‌నగర్‌(హైదరాబాద్‌): అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు మహిళను హత్య చేసేందుకు యత్నించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనలో బాధితురాలి భర్తే ప్రధాన సూత్రధారని తేలింది. సీఐ ముత్తుయాదవ్‌ వివరాల ప్రకారం.. మహేశ్వరీనగర్‌కు చెందిన స్పందన (26), వేణుగోపాల్‌ భార్యాభర్తలు. వీరికి ఏడాదిన్నర కుమార్తె ఉంది.

గత నెల 30న అర్ధరాత్రి మాస్క్‌ ధరించిన ఓ ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి కత్తితో స్పందన గొంతుకోసి హత్య చేసేందుకు యత్నించిన సంగతి విదితమే. భర్త తన కుమార్తెను వరండాలోకి తీసుకెళ్లిన సమయంలోనే ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి హత్యాయత్నానికి పాల్పడడం పలు అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి విచారణ చేపట్టగా అసలు నిజం బయటపడింది. 

భార్యపై అనుమానంతోనే.. 
భార్య తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడటం గమనించిన వేణుగోపాల్‌ ఆమెపై అనుమానం పెంచుకుని హత్యకు పథకం పన్నాడు. యూసుఫ్‌గూడకు చెందిన మిత్రుడు, జూనియర్‌ ఆర్టిస్టు తిరుపతికి హత్యకు చేస్తే రూ.7 లక్షలు ఇస్తానని కొంత అడ్వాన్స్‌ ఇచ్చాడు. గతేడాది కూడా వేణుగోపాల్‌ స్వగ్రామమైన చేగుంటలో స్పందనను హత్య చేసేందుకు యత్నించి విఫలమయ్యాడు. ఈసారి ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని తాను ఇంట్లో ఉండగానే హత్య జరిగితే అనుమానం రాదని గ్రహించి గతనెల 30న హత్య చేసేందుకు పూనుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ, గత హత్యాయత్నం సమయంలో వినియోగించిన బైక్‌ నంబరు ఆధారాలతో హత్యాయత్నానికి పాల్పడిన తిరుపతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, హత్యకు పురమాయించింది వేణుగోపాలే అని చెప్పడంతో సోమవారం రిమాండ్‌కు తరలించారు. 

చదవండి: వివాహితుడితో ప్రేమ.. సరిగ్గా ఎంగేజ్‌మెంట్‌కు ముందు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top