
లక్నో: మరింత కట్నం తేవాలంటూ అత్తింటి వారు పెట్టే వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు కారణమంటూ భర్తతోపాటు అత్తింట్లో వాళ్ల పేర్లను ఒంటిపై రాసుకుని మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. మనీషా అనే యువతికి 2023లో నోయిడాకు చెందిన కుందన్‌తో పెళ్లయింది. మొదట్లో అంతా సాఫీగానే వారి కాపురం సాగింది. ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయి.
పెళ్లప్పుడు బుల్లెట్ బైక్‌ను కొనిచ్చారు మనీషా తల్లిదండ్రులు. అయితే, ఎస్‌యూవీ కావాలంటూ కుందన్ కుటుంబీకులు డిమాండ్ చేయనారంభించారు. తమకు అంత స్థోమత లేదని చెప్పడంతో మనీషా తల్లిదండ్రులు తెలపడంతో శారీరకంగా, మానసికంగా వేధింపులు తీవ్రతరం చేశారు. ‘అన్నం పెట్టకుండా పస్తులుంచుతున్నారు. గదిలో ఉంచి తాళం వేస్తున్నారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ కుందన్ బెదిరిస్తున్నాడు’అని మనీషా తన చేతిపై రాసుకుంది.
వేధింపులు తట్టుకోలేక మనీషా 2024లో పుట్టింటికి చేరుకుంది. అక్కడున్నా వేధింపులకు మాత్రం అంతం లేకుండాపోయింది. ఇటీవల కుందన్, అతడి తల్లిదండ్రులు, ఇద్దరు సోదరులు గ్రామ పెద్దను తీసుకువచ్చి విడాకుల పత్రాలపై సంతకం చేయాలంటూ మనీషాను, ఆమె కుటుంబాన్ని ఒత్తిడి చేశారు. ఒప్పుకోకపోయేసరికి బెదిరింపులు మొదలుపెట్టారు. ‘నా మరణానికి భర్త కుందన్, మరుదులు దీపక్, విశాల్‌లే కారణం. పంచాయితీ సమయంలో వారు నా కుటుంబానికి హెచ్చరికలు చేశారు’అంటూ మనీషా తన కాలిపై రాసుకుంది.
‘మంగళవారం రాత్రి మేడపైన పడుకునేందుకు వెళ్లిన మనీషా పురుగుమందు తాగింది. ఉదయానికి విగతజీవిగా కనిపించింది’అని కుటుంబీకులు చెప్పారు. అత్తింటి నుంచి ఎదురవుతున్న ఒత్తిళ్లు, వేధింపులను తాళలేక డిప్రెషన్‌తో బలవన్మరణం చెందిందన్నారు. చనిపోయేముందే శరీరంపై ఆమె ఈ మేరకు రాసుకుందన్నారు. మనీషా మరణానికి విష ద్రావకమే కారణమని పోస్టుమార్టంలో తేలిందని ఏఎస్‌పీ ఎన్‌పీ సింగ్ చెప్పారు. ఆమె కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు.