వీడు గజదొంగ గంగన్నా!.. పోలీసులకే కాల్‌ చేసి పట్టుకోండి అని సవాల్‌?

Luxury Car Robbery In Park Hyatt Hotel: Accused Challenge To Police - Sakshi

చుక్కలు చూపిస్తున్న కరడుగట్టిన కార్ల దొంగ

వాట్సాప్‌ కాల్‌లో సత్యేంద్రసింగ్‌ షెకావత్‌ సవాల్‌

పోలీసుల్ని ముప్పుతిప్పలు పెడుతున్న నిందితుడు

సాక్షి, హైదరాబాద్‌: అత్యంత ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ లగ్జరీ కార్లను అపహరిస్తున్న చోరుడిని పట్టుకోవడంలో పోలీసులు చేతులెత్తేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో గత జనవరి 26న రాత్రి కన్నడ నిర్మాత వి.మంజునాథకు చెందిన ఫార్చునర్‌ కారు (కేఏ 04 ఎంఎక్స్‌ 1000)ను దొంగిలించి పరారైన ఈ దొంగను పట్టుకోవడానికి స్థానిక పోలీసులు యత్నిస్తుండగానే మళ్లీ గత మే నెలలో నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో, ఆగస్టు 5వ తేదీన బౌరంపేటలో రెండు కార్లను అపహరించాడు.
చదవండి: చుట్టూ సీసీ కెమెరాలు.. కానీ కారు మాయం..!

► పార్క్‌ హయత్‌ హోటల్‌లో దొంగతనం చేసిన తర్వాత నిందితుడి కోసం బంజారాహిల్స్‌ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి గాలించగా ఇంటర్‌స్టేట్‌ కార్ల దొంగ సత్యేంద్రసింగ్‌ షెకా వత్‌గా గుర్తించారు. గతంలో ఢిల్లీ, మహా రాష్ట్ర, గుజరాత్‌ పోలీసులు ఇతగాడిని అరెస్ట్‌ చేసినట్లు కూడా తేలింది. బెయిల్‌పై విడుదలైన షెకావత్‌ కన్ను హైదరాబాద్‌పై పడింది. 
► నాలుగు నెలల క్రితమే బంజారాహిల్స్‌ పోలీసులు ఈ కార్ల దొంగను పట్టుకోవడానికి రాజస్థాన్‌కు వెళ్లారు. ‘నన్ను పట్టుకునే దమ్ము ఉందా’ అంటూ పోలీసులకే సవాల్‌ విసి రాడు. ‘నేను ఇక్కడే ఉన్నాను. పట్టుకోండి చూద్దాం’ అంటూ ఇంటర్నెట్‌ వాట్సాప్‌ కాల్‌లో సవాల్‌ విసిరి తప్పించుకున్నాడు.  
► పోలీసులు వారం రోజుల పాటు అక్కడ తిష్టవేసి షెకావత్‌ తండ్రిని ప్రశ్నించారు. అతని భార్యతో కూడా మాట్లాడారు. వారి కదలికలపై దృష్టి పెట్టిన విషయాన్ని షెకావత్‌ గుర్తించి నేరుగా బంజారాహిల్స్‌ పోలీసులకే ‘నన్ను పట్టుకోవడం మీ తరం కాదంటూ మరోసారి సవాల్‌ విసిరాడు. మీరు వాడుతున్న టెక్నాలజీ చాలా పాతదని అప్‌డేట్‌ అవ్వాలని ఆ తర్వాతే తనను పట్టుకోగలుగుతారని హెచ్చరించారు. దీంతో పోలీసులు వెనక్కి వచ్చారు.
చదవంండి: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు

► నిందితుడిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, బంజారాహిల్స్‌ పోలీసులు ప్రయత్నాలు సాగిస్తుండగానే నగర శివార్లలో మరో రెండు ఖరీదైన కార్లను చోరీ చేయడం కలకలం రేపింది. నాచారం పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు చెందిన ఇసుజు వాహనాన్ని తస్కరించిన షెకావత్‌ కోసం నాచారం పోలీసులు ఇటీవల జైపూర్‌ వెళ్లారు.  
► భర్తకు సహకరిస్తున్న షెకావత్‌ భార్యను అరెస్ట్‌ చేసి నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయతి్నంచారు. ఆమెకు స్థానిక కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో వారి ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. ఆగస్టు 5న దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌పరిధిలోని బౌరంపేటలో ఓ గేటెడ్‌ కమ్యూ నిటీలో నివాసం ఉంటున్న గ్లాండ్‌ ఫార్మా సంస్థకు చెందిన డీజీఎం రవీంద్ర వర్మ కారును కూడా టెక్నాలజీ సహాయంతో షెకావత్‌ తస్క రించాడు. ఈ కేసులో కూడా సైబరాబాద్‌ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
చదవండి: ప్రియుడి ఘాతుకం: నడిరోడ్డుపై యువతి దారుణ హత్య 

►ఇప్పటిదాకా దేశంలోని పలు నగరాల్లో షెకావత్‌ వందకుపైగా కార్లను తస్కరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తస్కరించిన కార్లను డ్రగ్‌ డీలర్లు, ఉమెన్‌ ట్రాఫికింగ్‌ కోసం పని చేస్తున్న వారికి అమ్ముతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  
► దొంగిలించిన కార్లను స్వయంగా నడుపుకొంటూ వెళ్లి గుర్తు తెలియని ప్రాంతంలో కొన్నాళ్లు ఉంచిన తర్వాత తాపీగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌ విసురుతున్న షెకావత్‌ను ఎవరు పట్టుకుంటారో వేచి చూడాల్సిందే.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top