ఈడీ చర్యలు రాజ్యాంగ విరుద్ధం | Sakshi
Sakshi News home page

ఈడీ చర్యలు రాజ్యాంగ విరుద్ధం

Published Wed, Mar 20 2024 6:23 AM

Judge M K Nagpal hearing Delhi excise policy case transferred - Sakshi

ఎమ్మెల్సీ కవిత ఆరోపణ

కస్టడీ నుంచి విడుదలకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో తాజా పిటిషన్‌.. గత రిట్‌ పిటిషన్‌ ఉపసంహరణ 

ఢిల్లీ మద్యం కేసు విచారిస్తున్న జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ బదిలీ  

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయడంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తన తండ్రి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కేంద్రంలో అధికార పారీ్టతో పొత్తు లేని కారణంగానే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇప్పటివరకూ తన పేరు చేర్చలేదని, అదేవిధంగా చార్జిషిటులోనూ తన పేరు లేదన్నారు. ఆగస్టు 22, 2022న ఈడీ దర్యాప్తు ప్రారంభించిందని, ఆ సమయంలో చందన్‌ రెడ్డి అనే వ్యక్తిపై పరుషంగా ప్రవర్తించిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈడీ ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదులో కూడా తనను నిందితురాలిగా పేర్కొనలేదన్నారు.

సీబీఐ విచారణ సమయంలో బుచ్చిబాబు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చారన్నారు. ఈడీ తనకు మార్చి 7, 2023న సమన్లు జారీ చేసిందని, తన హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించొద్దని కోరానన్నారు. అదే సమయంలో నిందితుల్లో ఒకరైన అరుణ్‌ రామచంద్ర పిళ్‌లై తొలుత తాను చేసిన ప్రకటనలను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారని పిటిషన్‌లో తెలిపారు. కాగా, ఈ పిటిషన్‌పై త్వరగా విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాదులు మంగళవారం సీజేఐ ధర్మాసనం ముందు లెటర్‌ రూపంలో విజ్ఞప్తి చేశారు. బుధవారం సీజేఐ ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. 
 
కవిత పిటిషన్‌లో ముఖ్యాంశాలు... 
‘ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు తర్వాత తెలంగాణలో, ఇతరత్రా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతలు దాడి ముమ్మరం చేయడం ప్రారంభించారు. తెలంగాణ బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అరి్వంద్‌ తదితరులు కవిత అరెస్టు తథ్యం అంటూ బహిరంగ ప్రకటనలు చేశారు. ఢిలీ మద్యం విధానంలో నా ప్రమేయం ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేశారు. 21.8.22న బీజేపీ నేతలు కుంభకోణంలో నన్ను మధ్యవర్తి అంటూ ఆరోపించారు. నా తండ్రి, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను కించపరిచే ఏకైక ఉద్దేశంతోనే నన్ను ఈ కేసులో ఇరికించినట్లు కనిపిస్తోంది.

నా ప్రతిష్టకు ఎంతో భంగం కలిగించారు. గత పిటిషన్‌ విచారణ సమయంలో తదుపరి విచారణ వరకూ నన్ను అరెస్టు చేయబోమని దర్యాప్తు సంస్థ తరఫు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తదుపరి విచారణ సమయంలోనూ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ను ఉల్లంఘించి ఈడీ అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించారు. ఈడీ రిమాండు రద్దు చేస్తూ కస్టడీ నుంచి విడుదల చేయాలి’ అని కవిత తాజా పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
రిట్‌ పిటిషన్‌ ఉపసంహరించుకున్న కవిత 
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఈడీ జారీచేసిన సమన్లను సవాలు చేస్తూ గతంలో దాఖలు చేసిన క్రిమినల్‌ రిట్‌ పిటిషన్‌ను కవిత ఉపసంహరించుకున్నారు. మంగళవారం ఈ పిటిషన్‌ అభిõÙక్‌ బెనర్జీ, నళిని చిదంబరం పిటిషన్లతో కలిపి జస్టిస్‌ బేలా ఎం. త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం ముందుకొచి్చంది. అరెస్టు చేసినందున పిటిషన్‌ కాలపరిమితి ముగిసినట్లయిందని కవిత తరఫు సీనియర్‌ న్యాయవాది విక్రమ్‌ చౌదరి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అభ్యర్థనలన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం పిటిషన్‌ ఉపసంహరణకు ధర్మాసనం అనుమతించింది.

విక్రమ్‌ చౌదరి విజ్ఞప్తి మేరకు చట్టానికి అనుగుణంగా పరిష్కారాలు అనుసరించడానికి స్వేచ్ఛ కలి్పస్తున్నట్లు ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. అయితే, ఈ కేసులో ఈడీ తరఫు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు అభిప్రాయం తెలుసుకోవాలని ధర్మాసనం యతి్నంచింది. ఎస్‌వీ రాజు, అభిõÙక్‌బెనర్జీ తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వేరే కేసుల విచారణలో ఉండటంతో అభిషిక్, నళిని పిటిషన్లను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. దీంతో ఆ సమయంలో ఎస్‌వీ రాజు తన అభిప్రాయం వెల్లడించే అవకాశం ఉంది. కాగా, ఈడీ కార్యాలయంలో కవిత విచారణ మూడోరోజూ కొనసాగింది. పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే, ఇతర నిందితులతో కలిపి కవిత విచారణ ఇంకా ప్రారంభించలేదు. 
 
రౌజ్‌ అవెన్యూ కోర్టు అనుమతి 
తన తల్లి, కుమారులను కలవడానికి అనుమతి ఇవ్వాలని కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను రౌజ్‌ అవెన్యూ కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ మంగళవారం విచారించారు. కవిత విజ్ఞప్తిని న్యాయమూర్తి అనుమతించారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకూ తల్లి, కుమారులు సహా ఎనిమిదిని కలిసేందుకు జడ్జి అనుమతి ఇచ్చారు. కాగా, మంగళవారం సాయంత్రం కవితతో ఎమ్మెల్యే కేటీఆర్‌ భేటీ అయ్యారు. మంగళవారం సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలను వివరించారు. సుమారు గంటసేపు కవితతో పలు అంశాలు చర్చించినట్లు తెలిసింది.   

జడ్జి నాగ్‌పాల్‌ బదిలీ 
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసు విచారిస్తున్న రౌజ్‌ అవెన్యూ కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ బదిలీ అయ్యారు. తీస్‌ హజారీ కోర్టుకు నాగ్‌పాల్‌ను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. నాగ్‌పాల్‌ స్థానంలో డిస్ట్రిక్ట్‌ జడ్జి (కమర్షియల్‌) కావేరి బవేజా రౌజ్‌ అవెన్యూ కోర్టుకు బదిలీ అయ్యారు. ఇకపై ఢిల్లీ మద్యం కేసును కావేరి బవేజా విచారించనున్నారు.

Advertisement
Advertisement