బీఆర్‌ఎస్‌ నేతలపైనా ఎందుకు నిఘా? | SIT officials questioned Prabhakar Rao | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నేతలపైనా ఎందుకు నిఘా?

Dec 26 2025 5:06 AM | Updated on Dec 26 2025 5:06 AM

SIT officials questioned Prabhakar Rao

ప్రభాకర్‌రావును ప్రశ్నించిన సిట్‌ అధికారులు 

‘ఎమ్మెల్యేలకు ఎర’ ఆపరేషన్‌ సైతం ట్యాపింగ్‌ ద్వారానే.. 

నాటి నిందితుడు నందకుమార్‌ వాంగ్మూలం నమోదు 

ముగిసిన ప్రభాకర్‌రావు కస్టోడియల్‌ విచారణ 

గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు త్వరలో నోటీసులు 

సాక్షి, హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేవలం ప్రతిపక్షాలకే పరిమితం కాలేదని, నాటి అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగిందని సిట్‌ గుర్తించింది. దీనికి సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన అధికారులు ఆ కోణంలోనూ తమ కస్టడీలో ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావును ప్రశ్నించారు. 

ఈ విషయంపైనే రెండు రోజుల క్రితం మరో నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుతో కలిపి విచారించారు. ప్రభాకర్‌రావు 14 రోజుల కస్టోడియల్‌ విచారణ గురువారంతో ముగిసింది. బీఆర్‌ఎస్‌ నేతలపై నిఘా ఉంచడం వెనుక ప్రభాకర్‌రావుతోపాటు హైదరాబాద్‌ టాస్‌్కఫోర్స్‌ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు పాత్ర ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారంపై గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకు త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు. 

ఢిల్లీ నుంచి నిఘా పరికరాలు.. 
మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేంద్రంగా సాగిన ఎమ్మెల్యేలకు ఎర ఆపరేషన్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారానే వెలుగులోకి వచి్చందని, దాని కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఖరీదు చేశారని సిట్‌ తేల్చింది. గతంలో జరిగిన దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పార్టీకి బ్రేక్‌ వేయాలంటూ వచ్చిన ఆదేశాలతో ప్రభాకర్‌రావు టీమ్‌ అప్రమత్తమైందని సిట్‌ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి 2022 అక్టోబర్‌ చివరి వారంలో ప్రభాకర్‌రావు–రాధాకిషన్‌రావు మధ్య జరిగిన ఓ సమావేశంలో నాటి ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి వ్యవహారం ప్రస్తావనకు వచ్చిందని గుర్తించింది. 

బీఆర్‌ఎస్‌ నేతలకు సంబంధించిన అక్రమ ట్యాపింగ్‌పైనా ప్రభాకర్‌రావును ప్రశ్నించింది. ‘నాకు పదవీ విరమణ తర్వాత అప్పటి డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఎక్స్‌టెన్షన్‌ కోసం ప్రతిపాదనలు పంపారు. దీని ఆధారంగా అప్పట్లో హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్న రవిగుప్తా ఆదేశాలు ఇచ్చారు. నా పనితీరు ఆధారంగానే ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఎవరికీ సంబం«ధం లేదు. అప్పటి సీఎం కేసీఆర్‌కు, నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ప్రభాకర్‌రావు సిట్‌ అధికారులతో చెప్పారు. 

ఈ నేపథ్యంలోనే సిట్‌ గురువారం నాటి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తోపాటు మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి నుంచి వాంగ్మూలాలు సేకరించింది. అధికారులు సేకరించిన ఆధారాల్లో కొందరు రాజకీయ నాయకులు, అనుచరులు, జర్నలిస్టులు, అధికారులకు సంబంధించినవి ఉండటంతో వాటిని చూపిస్తూ... అవి ఎందుకు ట్యాప్‌ చేయాల్సి వచి్చందంటూ ప్రభాకర్‌రావును సిట్‌ ప్రశ్నించింది.  

నాడు డీజీపీకి ఫిర్యాదుచేశా: నందకుమార్‌ 
ఈ కేసులో బాధితుడిగా ఉన్న ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్‌ వాంగ్మూలాన్నీ సిట్‌ సేకరించింది. ‘నన్ను సిట్‌ అధికారులు ప్రశ్నించారు. నా ఫోన్‌ ట్యాప్‌ చేశారనే అనుమానాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫామ్‌హౌస్‌లో రికార్డు చేసిన వీడియోలు బయటకు వెళ్లాయి. 

కేసీఆర్‌ స్వయంగా వాటిని మీడియాకు విడుదల చేశారు. నాటి ఫామ్‌హౌస్‌ తతంగంపై సిట్‌ అధికారులు వివరాలు అడిగారు. ఎమ్మెల్యేలు, స్వామీజీలతోపాటు నా ఫోన్‌ కూడా ట్యాపింగ్‌ చేశారు. దీనిపై అప్పట్లో డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశా. రాధాకిషన్‌రావు ఎలా వేధించారని సిట్‌ అధికారులు అడిగారు. వారికి పూర్తి సమాచారం అందించా’ అని నందకుమార్‌ మీడియాకు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement