మాజీ మంత్రుల కార్యాలయాల్లో ద్రస్తాల చోరీ!  | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రుల కార్యాలయాల్లో ద్రస్తాల చోరీ! 

Published Sun, Dec 10 2023 5:00 AM

Hyderabad: Important documents lost in animal husbandry office - Sakshi

సాక్షి, హైదరాబాద్, నాంపల్లి (హైదరాబాద్‌): మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఓఎస్డీ కల్యాణ్‌పై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థకశాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించిన కల్యాణ్‌ బీరువాలో ఉన్న ద్రస్తాలను కారులో తరలించుకునిపోయారు. వాచ్‌మన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. నాంపల్లి ఇన్‌స్పెక్టర్‌ అభిలాష్‌ తెలిపిన వివరాల ప్రకారం... మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్‌ శుక్రవారం మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోనికి అక్రమంగా ప్రవేశించారు.

అక్కడి సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపేశారు. అంతటితో ఆగకుండా చించివేసిన ఫైళ్లను తన కారులో తరలించుకుని పోయారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు సైతం పనిచేయకుండా చేశారు. దీంతో వాచ్‌మెన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళ్యాణ్‌పై కేసు నమోదు చేసినట్లు వివరించారు. అతడికి సహకరించిన కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ ఎలిజ మోహన్, అటెండర్లు వెంకటేశ్, ప్రశాంత్‌లపైనా కేసులు నమోదు చేశామని చెప్పారు.  

ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలోనూ... 
హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియం ఎదురుగా ఉన్న రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆర్‌టీ) కార్యాలయం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు అధికారిక ద్రస్తాలు ఎత్తుకెళ్లినట్టు ప్రచా రం జరుగుతోంది. ఇక్కడే మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి కార్యాలయం ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మాజీ మంత్రి కార్యాలయం నుంచి ఒక ఆటోలో కొంతమంది ఫైళ్లు తీసుకెళ్తున్నట్టు తమకు సమాచారం వచ్చిందని అబిడ్స్‌ పోలీసులు తెలిపారు.

కార్యాలయం వాచ్‌మెన్‌ వెల్లడించిన ప్రకారం కొన్ని బస్తాల్లో కాగితాలు, ఫైళ్లు తీసుకెళ్ళినట్టు పోలీసులు చెబుతున్నారు. అందులో ఏమున్నాయనేది విచారణ జరిపితే తెలుస్తుందని, అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. వాస్తవానికి రెండో శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. గేట్‌ కూడా మూసివేస్తారు. కానీ ఆగంతకులు లోనికెలా వచ్చారు? తాళం ఎలా తీశారు అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

ఈ ఘటన సెలవు రోజున... అదీ రాత్రి సమయంలో జరగడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఫైళ్లు తీసుకెళ్లిన వ్యక్తి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. కార్యాలయంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తీసుకెళ్లారని భావిస్తున్న ద్రస్తాలు ఏ శాఖకు సంబంధించినవి? వాటి ప్రాధాన్యం ఏమిటనేది తేలాల్సి ఉంది. ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదీనంలో ఉంటుంది. దీనిపై పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేనను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు.

Advertisement
 
Advertisement