వివాహితపై అత్తింటివారి దాడి | Husband attacks his wife | Sakshi
Sakshi News home page

వివాహితపై అత్తింటివారి దాడి

Published Fri, May 3 2024 1:28 AM | Last Updated on Fri, May 3 2024 1:28 AM

Husband attacks his wife

విచక్షణారహితంగా రోడ్డుపైనే చితకబాదిన భర్త

గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితులు

మదనపల్లె: కాపురం చేసేందుకు అత్తారింటికి వచ్చిన భార్యపై భర్త, అత్తామామలు దాడిచేసి, విచక్షణారహితంగా కొట్టి గాయపరిచిన ఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. తట్టివారిపల్లె పంచాయతీ దేవతానగర్‌లో నివాసం ఉంటున్న రెడ్డెప్ప, రామలక్ష్మమ్మల కుమారుడు ఎం.నరసింహులు(34)కు సోమల మండలం పెద్ద ఉప్పరపల్లెకు చెందిన స్వప్న(28)తో వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా స్వప్న ఆరునెలలుగా పుట్టినింటిలోనే ఉంటోంది.

ఈ క్రమంలో భర్త నరసింహులు, మౌనిక అనే వేరొక అమ్మాయిని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడని తెలియడంతో, కాపురం నిలబెట్టుకునే ఉద్దేశంతో తల్లి శకుంతల, అన్న మురళితో కలిసి బుధవారం భర్త నరసింహులు ఇంటికి వెళ్లింది. కోడలు స్వప్నను ఇంటిలోకి రానివ్వకుండా, గుమ్మంలోనే మామ రెడ్డెప్ప, అత్త రామలక్షుమ్మలు అడ్డుకున్నారు. ఇన్నాళ్లుకు మొగుడు గుర్తుకు వచ్చాడా... ఇంట్లోకి రానవసరం లేదంటూ బయటకు నెట్టేందుకు ప్రయతి్నంచారు. తన భర్త ఇంటిలోకి రావద్దని చెప్పడానికి మీరెవరని, స్వప్న మొండిగా లోనికి వెళ్లేందుకు ప్రయతి్నంచడంతో అత్తమామలు, కోడలిపై దాడికి పాల్పడ్డారు.

కుమార్తెను అత్తామామలు విచక్షణారహితంగా కొడుతుండటంతో అడ్డుకునేందుకు వెళ్లిన తల్లి శకుంతలను సైతం వారు కాలితో తన్ని గెంటేయడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈలోపు అక్కడకు చేరుకున్న భర్త నరసింహులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చేందుకు నీకెంత ధైర్యమంటూ రోడ్డుమీద అందరూ చూస్తుండగానే, కాలితో తన్నుతూ, కొడుతూ వీరంగం సృష్టించాడు. భార్య, అత్తను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి వెళ్లారు. తల్లి శకుంతలకు కడుపునకు శస్త్రచికిత్స జరిగిన ప్రదేశంలో బలంగా కాలితో తన్నడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తాలూకా సీఐ ఎన్‌.శేఖర్‌ తెలిపారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement