
తాడేపల్లి : కూటమి ప్రభుత్వం అక్రమ కేసులతో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి దగ్గర్నుంచి ఈరోజు(శనివారం) రిమ్స్ ఆస్పత్రి తరలించే విషయంలోనూ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది పోసాని అనారోగ్యంతో ఉన్నా పోలీసుల వేధింపుల పర్వం మాత్రం కొనసాగుతోంది. అరెస్టు సమయంలో తన అనారోగ్యం సమస్యలను పోసాని, ఆయన కుటుంబ సభ్యులు.. పోలీసులకు చెప్పారు. అరెస్ట్ చేసేటప్పుడు తనకు రేపు ఎంఆర్ఐ స్కాన్ ఉందని పోలీసులకు స్పష్టం చేశారు. అయినా వినిపించుకోకుండా పోసానిని అరెస్ట్ చేశారు. తమ వద్ద మంచి డాక్టర్లు ఉన్నారంటూ జీపులో ఎక్కించుకుని పోసానిని తీసుకువెళ్లారు సంబేపల్లి ఎస్ఐ.

తెల్లారిదాకా జీప్‌లో తిప్పుతూ..
ఇలా తెల్లారిదాకా జీపులోనే తిప్పుతూ పోసానిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ఖాకీలు. 27వ తేదీ మధ్యాహ్నం ఓబులవారి పల్లె పీఎస్ కు తరలించారు. అప్పుడు కూడా పోసానిని 9 గంటల పాటు విచారించారు. కోర్టుకు తరలించే ముందు పీహెచ్ సీ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. గొంతు, చేయి నొప్పితో ఉన్న పోసానికి బీపీ, షగర్ చెక్ చేసి కోర్టుకు తరలించారు.

రెండు రాత్రిళ్లు నిద్ర, ఆహారం లేకుండా పోసానిని ఖాకీలు ఇబ్బంది పెట్టారు. రాజంపేట జైలుకు తరలించిన తర్వాత ఛాతి నొప్పితో పోసాని తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక జైలు నుంచి ఆస్పత్రికి తరలింపులోనూ ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడింది. తీవ్రంగా నొప్పితో బాధపడుతున్నా మధ్యాహ్నం వరకూ ఆస్పత్రికి తరలించకుండా వేధింపులకు గురిచేశారు. ఈసీజీ పరీక్షల్లో హార్ట్ బీట్ తేడా కనపించడంతో కడప రిమ్స్ కు తరలించారు. రిమ్స్ కు పోసానిని తరలించే విషయంలో కూడా అలక్ష్యం ప్రదర్శించారు. చాతి నొప్పితో బాధపడుతున్న పోసానిని అంబులెన్స్ లో కాకుండా పోలీస్ వ్యాన్ లో తరలించడం పోలీసుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయి అనే దానికి అద్దం పడుతోంది.

