విశాఖపట్నం జిల్లా: మండలంలోని అనంతవరంలో శుక్రవారం గుర్రపు, ఎడ్ల బండ్ల పందాలు నిర్వహించారు. ఈ పందాల్లో ఓ గుర్రం, మరో ఎడ్ల బండి గాడితప్పి జనాల్లోని దూసుకు పోవడంతో నలుగురు గాయపడ్డారు. ఈ పందాలకు విజయనగరం జిల్లా జామి మండలం అలమండ, కొట్యాడ, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి తదితర ప్రాంతాల నుంచి పది గుర్రాలు, విజయనగరం జిల్లా కొట్టాం, బోనంగి, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి నుంచి 12 ఎడ్లు బళ్లు వచ్చాయి. ముందుగా గుర్రపు పందాలు ప్రారంభించారు. నాలుగు గుర్రాలు బాగానే లంకించాయి. ఐదో గుర్రాన్ని పందెంలోకి దించారు.
కొద్దిగా ముందుకు పరుగు తీసి జనాల్లోకి దూసుకు పోయింది. ఈ ఘటనలో గుర్రం పైన కుర్చున్న దేవరాపల్లికి చెందిన నవీన్‌కు, పందాలను తిలకించేందుకు వచ్చిన అన్నవరానికి చెందిన జి.ఎర్నిబాబు(53) కుడికాలి మోకాలు భాగంలో గాయాలయ్యాయి. ఎడ్ల బండ్ల పందాలు ట్రైల్ రన్ చేస్తుండగా జోడెద్దులు బండితో పాటు జనాల్లోకి దూసుకు వెళ్లాయి. ఈ సంఘటనలో అనంతరం పంచాయతీ గొల్లలపాలేనికి చెందిన చందక శ్రావణి(33), అల్లబోని పైడమ్మ(49) గాయపడ్డారు. 108 ఈఎంటీ తిరుపతి ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించారు.


