విశాఖపట్నం: ప్రేమకు దేశాలు, సరిహద్దులు అడ్డుకావని నిరూపించింది ఈ జంట. ఏడు సముద్రాల అవతల పుట్టిన ఓ యువతి, మన వైజాగ్ కుర్రాడి ప్రేమలో పడి.. పెద్దలను ఒప్పించి భారతీయ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యేందుకు సిద్ధమైంది. శుక్రవారం వీరి నిశి్చతార్థం అత్యంత వైభవంగా జరిగింది.
నార్వేలో చిగురించిన ప్రేమ
ఎన్‌ఏడీ జంక్షన్ శాంతినగర్(అంబేడ్కర్ నగర్)కు చెందిన గొట్టిపల్లి జ్ఞాన్ ప్రకాష్ కుమారుడు సైమన్ 2016లో ఉద్యోగ రీత్యా నార్వే వెళ్లారు. అక్కడ ఓ బ్యాంకులో ఉద్యోగిగా స్థిరపడ్డారు. అదే ప్రాంతంలో స్పీచ్ అండ్ లాంగ్వేజ్ థెరపిస్ట్‌గా పనిచేస్తున్న తూరాతో సైమన్‌కు పరిచయం ఏర్పడింది. రెండేళ్ల కిందట నార్వేలో జరిగిన ఓ మ్యూజిక్ క్విజ్‌లో తొలిసారి కలుసుకున్న వీరి పరిచయం ప్రేమగా మారింది. తూరాలోని స్వచ్ఛమైన నవ్వు, స్వేచ్ఛా భావాలు సైమన్‌ను ఆకట్టుకోగా, సుమారు రెండేళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇళ్లలో చెప్పగా, ఇరు కుటుంబాలు సానుకూలంగా స్పందించాయి. భారతీయ కుటుంబ వ్యవస్థ, నార్వే కుటుంబ వ్యవస్థకు దగ్గరగా ఉంటుందని, ఇక్కడి వారిలో కనిపించే ప్రేమ, ఆప్యాయతలు తమకు ఎంతగానో నచ్చాయని వధువు కుటుంబ సభ్యులు తెలిపారు. తన కోడలిని భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో చూడాలన్న ఆశతో, తొలి బహుమతిగా చీరను అందించానని వరుడి తండ్రి జ్ఞాన్ ప్రకాష్ సంతోషం వ్యక్తం చేశారు.
వంటకాలు అదిరిపోయాయ్..
ఈ వేడుకకు హాజరైన నార్వే అతిథులు భారతీయ వంటకాలు ‘యమ్మీ’ అంటూ లొట్టలేశారు. చీరకట్టులో భారతీయ స్త్రీలు ఎంతో అందంగా ఉన్నారని, ఇక్కడి వారి మర్యాదలు, ఆప్యాయమైన పలకరింపులు తమను మంత్రముగ్ధులను చేశాయని ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు అర్థం చేసుకుని, నిండు నూరేళ్లు కలిసి జీవిస్తామని నూతన జంట ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. మాజీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, బీఎస్ కృష్ణ తదితరులు పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు.


