రాయచోటిలో ఉగ్రమూలాల కలకలం.. ఇళ్లలో దొరికిన బాంబుల నిర్వీర్యం | Police Defuse Bombs Seized From Terrorists In Rayachoti | Sakshi
Sakshi News home page

రాయచోటిలో ఉగ్రమూలాల కలకలం.. ఇళ్లలో దొరికిన బాంబుల నిర్వీర్యం

Jul 3 2025 8:23 PM | Updated on Jul 3 2025 9:08 PM

Police Defuse Bombs Seized From Terrorists In Rayachoti

సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. ఉగ్ర వాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో సూట్‌కేసు బాంబులను ఆక్టోపస్‌ పోలీసులు నిర్వీర్యం చేశారు.  ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్‌ జోన్‌గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్‌ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్‌ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్‌ అయినట్లు సమాచారం.

ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది.

పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్‌ అమానుల్లా(55) అలియాస్‌ అబూబకర్‌ సిద్దిక్‌, మహబూబ్‌బాషావీధిలో నివాసం ఉన్న షేక్‌ మన్సూర్‌ (47) అలియాస్‌ మహమ్మద్‌అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.

వీరి గృహాలలో బ్లాస్టింగ్‌ పరికరాలు, కేబుల్స్‌, నెట్‌వర్క్‌ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్‌కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement