
మహిళ హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
మృతురాలి చేతిపై ఉన్న పచ్చబొట్టు
ఆధారంగా దర్యాప్తు వేగవంతం
ముగ్గురు నిందితులు అరెస్టు
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
రాయచోటి టౌన్(అన్నమయ్య): కాళ్లు.. చేతులు కట్టేశారు.. గొంతుకు తాడుతో బిగించారు.. చనిపోయిన తరువాత ఆనవాళ్లు లభించకుండా చేసేందుకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. అయితే మృతి చెందిన మహిళ చేతి పై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హత్య జరిగిన వా రం రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. మృతురాలు మదనపల్లె నియోజకవర్గం పరిధిలోని రామసముద్రం ప్రాంతానికి చెందిన వెంకటరమణ భార్య బూసిపల్లె శివమ్మ(27) గా గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం విలేకరుల స మావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిధిలోని రామసముద్రం మండలం చెంబుకూరు ఎలకపల్లె రహదారిలో ఈనెల 11వ తేదీ గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగించారు. మృతదేహంపై పెట్రోలు పోసి తగలబెట్టడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. అక్కడ పెట్రోల్ కోసం వాడిన బాటిల్ మాత్రమే ఉండింది. అయితే మృతురాలి చేతిపై యస్మిత అనే పచ్చబొట్టు ఉండటంతో దాని ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. పచ్చ బొట్టును సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనే విషయం తెలిసింది.
అలాగే డాగ్‌స్క్వాడ్ సంఘటన స్థలం నుంచి బెంగళూరు రోడ్డు వైపు వెళ్లడంతో ఆ మేరకు టెక్నాలజీని ఉపయోగించి నిందితులను గుర్తించారు. నిందితులంతా మృతురాలి బంధువులే అని తేలడంతో ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బెంగళూరులో నివాసం ఉంటున్న ఎం.నీలావతి, రామసముద్రం మండలం గుండేవారిపల్లె నడింపల్లె ప్రాంతానికి చెందిన కన్నెమడుగు గణేష్, బెంగళూరులోని బి.హోసహళ్లి సజ్జాపురం ప్రాంతం అంబేద్కర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ హెచ్‌వీ గోపాల్ ఉన్నారు.
ఎందుకు హత్య చేశారంటే..
మృతురాలు బూసిపల్లె శివమ్మ అదే ప్రాంతానికి చెందిన సంతోష్ అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆమె బంధువులు భర్తకు తెలియకుండా ఆమెను హత్య చేసేందుకు పథకం రచించారు. ఇందులో భాగంగా మృతురాలి బంధువైన నీలావతి బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ హెచ్‌వీ గోపాల్‌తో హత్య చేసేందుకు బేరం కుదుర్చుకుంది. వీరికి కన్నెమడుగు గణేష్ అనే వ్యక్తి సహకరించాడు. ఆ తర్వాత వారు రామసముద్రం వచ్చి శివమ్మకు మాయమాటలు చెప్పి ఆమెను తమ వెంట శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లారు.
తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకు తాడు బిగించి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక ముందుగానే తమ వెంట తెచ్చుకున్న పెట్రోలును మృతదేహంపై పోసి నిప్పంటించారు. అయితే ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. మదనపల్లె డీఎస్పీ ఎస్.మహేంద్ర, రూరల్ సీఐ సత్యనారాయణ, రామసముద్రం ఎస్‌ఐ జి.రవికుమార్, మరికొంతమంది సిబ్బంది చాకచక్యంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారని ఎస్పీ ప్రశంసించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే కఠిన చర్యలు
రాయచోటి టౌన్ : సమాజంలో ప్రజలను ఉద్రేకపరిచేలా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్‌లు పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లాఎస్పీ విద్యా సాగర్‌నాయుడు హెచ్చరించారు. మదనపల్లెలో హనుమాన్ శోభాయాత్రలో జరిగిన సంఘటనపై సోమవారం ఆయన స్పందించి విలేకరులతో మాట్లాడారు. శోభాయాత్ర నిర్వాహకులు ముందుగా తమతో అనుమతులు పొందే సమయంలో ఇచ్చిన రూట్‌మ్యాప్ ప్రకారం కాకుండా వేరే దారిలో వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా సమస్యలు సృష్టించాలని చూశారన్నారు.
ప్రకటించిన సమయానికి రాకుండా సుమారు ఒకటిన్నర గంట ఆలస్యంగా రావడమే కాకుండా దారి మళ్లించి సమస్య ను సృష్టించడంతో తమ పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చిందన్నారు. కావాలనే శోభాయాత్రను దారి మళ్లించి సమస్యలు సృష్టించేందుకు కారణమైన వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే అక్కడ ఏదో జరిగిందని ఒక వర్గాన్ని అణచివేస్తున్నట్లుగా తప్పు డు సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపైన కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తించుకోవాలని సూచించారు.