విజయపురలో పరువు హత్య? | Sakshi
Sakshi News home page

విజయపురలో పరువు హత్య?

Published Sun, Oct 16 2022 8:29 AM

Honor killing In Vijayapura But Young Women Missing - Sakshi

యశవంతపుర: ప్రేమ విషయంగా ఓ యువకుడిని హత్య చేసిన ఘటన విజయపుర జిల్లా తికోటా పరిధిలో కలకలం రేపింది. తికోటా తాలూకా ఘోణసగి గ్రామానికి చెందిన యువకుడు మల్లికార్జున (19) బాగలకోట జిల్లా బీళగి తాలూకా హదరిహళ గ్రామం వద్ద కృష్ణానది పరివాహక ప్రాంతంలో గోనసంచిలో శవమై కనిపించాడు. మూడు రోజుల క్రితం కుళ్లిన స్థితిలో పోలీసులు గుర్తించారు.  

సహ విద్యార్థినితో ప్రేమ 
వివరాలు...ఘోణసగినకి చెందిన మల్లికార్జున బీఏ చదివేవాడు. సహ విద్యార్థినిని ప్రేమించాడు. ఇద్దరు కాలేజీకి వెళ్తున్నామంటూ విజయపుర వెళ్లేవారు. ఈ విషయం అమ్మాయి కుటుంబానికి తెలియటంతో మొదట చదువు.. ఆ తరువాతే ప్రేమ అంటూ సర్ది చెప్పారు. పెద్దల మాటలను పట్టించుకోకుండా ఇద్దరు ప్రేమాయణం సాగించారు. దీంతో తల్లిదండ్రులు మల్లికార్జునను బాగలకోట జిల్లా బనహట్టిలోని మిలిటరీ కాలేజీలో చేర్చారు.  ఇద్దరు రోజూ ఫోన్‌లో గంటలకొద్ది మాట్లాడేవారు. ఇదిలా ఉంటే బీఏ పరీక్షలు రాయడానికి మల్లికార్జున గ్రామానికి వచ్చాడు.

ఇద్దరూ అదృశ్యం 
సెప్టెంబర్‌ 23న రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన యువకుడు అదృశ్యమయ్యాడు.  తన కూతురిని కిడ్నాప్‌ చేశారని ఆమె తండ్రి తికోటా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కొడుకు కనిపించటంలేదంటూ మల్లికార్జున తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు ఇచ్చారు. అక్టోబర్‌ 10న కృష్ణానది పరివాహక ప్రాంతంలో మల్లికార్జున శవాన్ని  కనుగొన్నారు. యువతి ఎక్కడ ఉందనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. యువతి కుటుంబం ధనవంతులు కావటం వల్ల పరువు కోసం తన కొడుకును హత్య చేయించినట్లు యువకుని తండ్రి ఆరోపించారు. దీంతో తికోటా పోలీసులు యువతి తండ్రి గురప్ప, బంధువు అజీత్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

(చదవండి: స్టోన్‌ క్రషర్‌లో భారీ పేలుడు)

Advertisement
 
Advertisement
 
Advertisement