Kakinada: Fraud In Name Of The Karthikeya Co-Operative Building Society Ltd - Sakshi
Sakshi News home page

రూ.21 కోట్లు కొల్లగొట్టేశారు.. కుటుంబ సభ్యుల నిర్వాకం..

Jul 4 2023 10:59 AM | Updated on Jul 4 2023 12:44 PM

Fraud In Name Of Karthikeya Building Society In Kakinada - Sakshi

కుటుంబ సభ్యులనే డైరెక్టర్లుగా నియమించుకుని అధిక వడ్డీల ఆశ చూపి అమాయకులను బురిడీ కొట్టించి న కాకినాడ కార్తికేయ బిల్డింగ్‌ సొసైటీ గుట్టురట్టు అయ్యింది. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో అక్రమార్కుల ఆస్తులను సీజ్‌చేసి వేలం వేసేందుకు మార్గం సుగమమైంది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కుటుంబ సభ్యులనే డైరెక్టర్లుగా నియమించుకుని అధిక వడ్డీల ఆశ చూపి అమాయకులను బురిడీ కొట్టించి న కాకినాడ కార్తికేయ బిల్డింగ్‌ సొసైటీ గుట్టురట్టు అయ్యింది. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడంతో అక్రమార్కుల ఆస్తులను సీజ్‌చేసి వేలం వేసేందుకు మార్గం సుగమమైంది. తద్వారా సొసైటీ బాధితులకు ప్రభు త్వం నుంచి భరోసా లభించింది.  కాకినాడ కేంద్రంగా ఏర్పాటైన కార్తికేయ బిల్డింగ్‌ సొసై టీ డిపాజిటర్లకు మెచ్యూరిటీ సొమ్ములు ఇవ్వకుండా బోర్డు తిప్పేసిన వ్యవహారాన్ని ‘కొంప ముంచిన కార్తికేయ’.. శీర్షికన ‘సాక్షి’ గత ఏప్రిల్‌ 2న వెలుగులోకి తీసుకొచ్చింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ‘కార్తికేయ’­లో జరిగిన రూ.కోట్ల కుంభకోణంపై ప్రత్యేక దృష్టిపెట్టి సహకార శాఖ ద్వారా విచారణ జరిపించింది. ఆ శాఖ కమిషనర్‌ అహ్మద్‌బాబు, కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా సహకార శాఖ ద్వారా వివిధ కోణాల్లో విచారణ జరిపించింది. కార్తికేయ బిల్డింగ్‌ సొసైటీ ఆర్థిక కుంభకోణం విలువ రూ.21.58 కోట్లుగా లెక్క తేల్చి ప్రభుత్వానికి నివేదిక సిద్ధంచేసింది.

అధిక వడ్డీల ఆశచూపి.. 
అధిక వడ్డీలు ఇస్తామంటూ 300 మంది డిపాజిటర్లను నమ్మించి సుమారు రూ.19.40 కోట్ల వరకు సొసైటీ వారి నుంచి సేకరించింది. ఈ మొత్తానికి ఇవ్వాల్సిన వడ్డీయే రూ.2.05 కోట్లకు పైగా ఉంది. డిపాజిట్ల మొత్తంలో రూ.10 కోట్లను సొసైటీ ఖాతాలో ఎక్కడా నమోదు చేయకుండానే నొక్కేశారని తేలింది. అలాగే, అసలు రుణాలేమీ ఇవ్వకుండానే ఇచి్చనట్లుగా 361 మంది బినామీ పేర్లతో రూ.5.36 కోట్లు స్వాహా చేశారు. ఇందుకు వడ్డీ రూ.2 కోట్లు వచ్చినట్లుగా రికార్డుల్లో చూపించారు.

అంతేకాక.. రుణాలివ్వగా వాటి నుంచి వచ్చిన వడ్డీ రూ.1.65 కోట్లు అసలు సొసైటీలో జమచేయకుండానే వాటినీ దారి మళ్లించేశారు. ఈ వడ్డీ సొమ్ములో ఒక్కపైసా కూడా సొసైటీ నగదు పుస్తకంలో లేకపోవడం చూసి సహకార శాఖ అధికారులు విస్తుపోయారు. పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకోవడం వంటి భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడుతుందనే ముందుచూపుతో రిటైరైన ఉద్యోగులు, చిరుద్యోగులు, సన్న, చిన్నకారు రైతులు ‘కార్తికేయ’లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసిన రూ.2.56 కోట్లను కూడా మాయం చేసేసి డిపాజిటర్ల నోట మట్టికొట్టారు.

కుటుంబ సభ్యులే డైరెక్టర్లుగా.. 
ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా సహకార అ«ధికారి బొర్రా కనక దుర్గాప్రసాద్‌ ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ రిజి్రస్టార్‌ ఎన్‌విఎస్‌ఎస్‌ దుర్గాప్రసాద్‌ విచారణ జరిపి కుంభకోణాన్ని నిర్థారించారు. బిల్డింగ్‌ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అప్పటి ప్రెసిడెంట్‌ కోడి వీరవెంకట సత్యనారాయణ తన భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు వెంకటేశ్, శంకర్‌ను డైరెక్టర్లుగా నియమించుకుని ప్రజల సొమ్మును దిగమింగారు. వీరితో పాటు చేపూరి గంగరాజు, బాలం విజయకుమార్, గ్రంథి వీరేంద్ర, టేకి త్రినా«థ్‌ పుష్పరాజ్యం, అంజుమ్‌ సుల్తా­నా, దొమరసింగు సింహాద్రిరావు, ఇరుసు­మల్ల పార్వతి, ముసినాడ సాంబశివరావు, సొసైటీ మేనేజర్‌ మీర్‌ అమీర్‌హుస్సేన్, అకౌంటెంట్‌ కోన కనకమహాలక్ష్మి కుమ్మక్కై ఈ కుంభకోణానికి పాల్పడినట్లుగా తేలింది.

ప్రభుత్వ చొరవతో ఆస్తులు సీజ్‌.. 
మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించడంతో కోడి వీరవెంకట సత్యనారాయణ పేరుతో ఉన్న మూడు విలువైన ఆస్తులను సీజ్‌చేశారు. ఇందులో కాకినాడ వాకలపూడిలోని 1,400 చదర పు గజాలు ఖాళీ స్థలం, కాకినాడ నూకాలమ్మ గుడి వద్ద ఉన్న బిల్డింగ్‌ సొసైటీ భవనంతోపాటు మరో ఇల్లు సీజ్‌ చేశా రు. వీటి విలువ రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటాయి. త్వరలో వీటిని వేలం వేసి ఆ సొమ్ముతో డిపాజిటర్లకు ప్రభుత్వం న్యాయం చేయనుంది.
చదవండి: ఇదే నాకు మొదటి పెళ్లి... నాకు మందు, సిగరేట్లు కావాలి

బాధ్యులపై క్రిమినల్‌ కేసులు.. 
కుంభకోణానికి పాల్పడ్డ కోడి వీరవెంకట సత్యనారాయణ సహా 14 మందిపై జిల్లా సహకార అధికారి బొర్రా దుర్గాప్రసాద్‌ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రిమినల్‌ కేసులు నమోదుచేశారు. కాకినాడ టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ బి. నాగేశ్వర్‌నాయక్‌ వీరిపై ఐపీసీ 120బి, 420, 406, 408, 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి విచారణ కొనసాగిస్తోందని దుర్గాప్రసాద్‌ ‘సాక్షి’కి చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement