పీఏసీ సభ్యునిగా గొల్లపల్లి
సాక్షి, అమలాపురం: వైఎస్సార్ సీపీ రాజోలు నియోజకవర్గ సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవిని నియమించారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సభ్యునిగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరిదేవికి పి.గన్నవరం నుంచి 2004, 2009 ఎన్నికలలో విజయం సాధించి, రెండు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. ఆమె నియామకాన్ని రాజోలు నియోజకవర్గంలో పార్టీకి చెందిన రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల ప్రతినిధులు కార్యకర్తలు స్వాగతించారు. పలువురు ఆమెను కలిసి అభినందనలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. రాజోలు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
గోదావరిలో
వాయుస్తంభన దీక్ష
తాళ్లరేవు: చంద్ర గ్రహణం సందర్బంగా పిల్లంక గ్రామ పురోహితులు, వేద పండితుడు వేలూరి వెంకట కామేశ్వర శర్మ(కాశిబాబు) గోదావరిలో వాయు స్తంభన దీక్ష చేశారు. మంగళవారం ఆయన గౌతమి గోదావరి పిల్లంక పుష్కర ఘాట్ వద్ద నిర్మిస్తున్న వల్లీ, దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం సమీపంలో సుమారు మూడు గంటల పాటు యంత్ర రాజములకు, ఆలయానికి సహకరిస్తున్న దాతల గోత్రనామాలతో జపాన్ని నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6.02 నుంచి 6.55 గంటల వరకు గోదావరిలో తేలియాడుతూ వాయుస్తంభన జపం చేశారు. ఈ సందర్భంగా కాశిబాబు విలేకర్లతో మాట్లాడుతూ చంద్ర గ్రహణం ప్రభావం ప్రజలపై పడకుండా ఉండడంతోపాటు, రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఈ దీక్ష చేసినట్లు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు ఈ దీక్ష చేసినట్టు తెలియజేశారు.
అల్లూరి స్మారక ప్రాంతాల
అభివృద్ధి ప్రారంభం
అడ్డతీగల: విప్లవ వీరుడు అల్లూరి శ్రీరామరాజు స్మారక ప్రాంతాల అభివృద్ధి పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. అడ్డతీగల మండలం పైడిపుట్టలోని శ్రీరామరాజు నడయాడిన ప్రాంతంలో మార్చి ఒకటిన సమావేశమైన అల్లూరి శ్రీ రామరాజు యువజన సంఘం సభ్యులు.. స్మారక ప్రాంతాల అభివృద్ధి చేయాలని తీర్మానించారు. ఈ మేరకు పైడిపుట్టలో ప్రజాసమస్యల పరిష్కారానికి అల్లూరి వినియోగించిన రావిచెట్టు వద్ద రచ్చబండ పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. దాని చుట్టూ ఉద్యాన పార్కు నిర్మాణానికి అనువుగా స్థలాన్ని చదును చేస్తున్నారు. రచ్చబండ వద్ద అల్లూరి శ్రీరామరాజు (చాతి వరకూ) రాతి విగ్రహాన్ని నెలకొల్పడంతో పాటు 18 అడుగుల అల్లూరి భారీ విగ్రహాన్ని జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేస్తామని సంఘ సభ్యులు తెలిపారు. ఆయన జీవిత చరిత్రను శిలాఫలకంపై నిక్షిప్తం చేయించి ఆ ప్రాంతంలో ఉంచుతామన్నారు. రచ్చబండ ప్రాంతం చుట్టూ వ్యవసాయం చేసుకుంటున్న పరదా సోమన్నదొర.. అల్లూరి స్మారక ప్రాంతం అభివృద్ధి, ఉద్యాన వనం కోసం స్థలాన్ని దానంగా ఇవ్వడానికి అంగీకరించారని సంఘం గౌరవ అధ్యక్షుడు మంతెన వెంకట సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షుడు వేటుకూరి కృష్ణంరాజు తెలిపారు.
గొల్లపల్లి
సూర్యారావు
పాముల
రాజేశ్వరిదేవి


