అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

Mar 4 2026 8:18 AM | Updated on Mar 4 2026 8:18 AM

అల్లవరం: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ ‘‘చలో విజయవాడ’’ పిలుపుతో ధర్నా చౌక్‌లో నిరసన తెలియజేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే స్పందించాలని అమలాపురం మాజీ పార్లమెంట్‌ సభ్యురాలు, ఉభయగోదావరి జిల్లాల వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చింతా అనురాధ డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీ సిబ్బందికి గౌరవ వేతనాన్ని గణనీయంగా పెంచుతామని, పెండింగ్‌ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని ఆమె విమర్శించారు. దాదాపు 20 నెలలుగా హామీల అమలు కోసం వారు ఎదురు చూస్తుంటే వారి సమస్యలను పరిష్కరించకుండా చంద్రబాబు మోసం చేయడంలో తన మార్క్‌ రాజకీయాన్ని మరోసారి చూపించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం, ఆరోగ్యం, ప్రాథమిక విద్యను అందించే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను అణగదొక్కటంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందన్నారు. మండుటెండల్లో ధర్నా చౌక్‌లోనే వంటావార్పు చేపట్టి, రోడ్లపైనే భోజనాలు చేస్తూ, అక్కడే నిద్రించి నిరసనలు తెలుపుతున్నా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వంలో చలనం లేకపోవడంపై ఉద్యోగుల పట్ల వారి నిర్లక్ష్యం కనపడుతోందన్నారు. అంగన్‌వాడీల ఉద్యమానికి వైఎస్సార్‌ సీపీ తరఫున తాము సంఘీభావం వ్యక్తం చేస్తున్నట్లు అనురాధ తెలిపారు. అంగన్‌వాడీలకు గౌరవ వేతనాన్ని పెంచాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం గ్రాట్యుటీ సౌకర్యం కల్పించాలని, యాప్‌ల ద్వారా పెరిగిన ఆన్లైన్‌ పని భారాన్ని తగ్గించాలని, రిజిస్టర్ల నిర్వహణను సరళతరం చేయాలని, పదవీ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాలను పెంచి వారందరికీ సామాజిక భద్రత కల్పించాలని అనురాధ డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement