సాచివేతపై ప్రశ్నిస్తే అణచివేతా? | - | Sakshi
Sakshi News home page

సాచివేతపై ప్రశ్నిస్తే అణచివేతా?

Mar 4 2026 8:18 AM | Updated on Mar 4 2026 8:18 AM

అమలాపురం టౌన్‌: అంగన్‌వాడీలపై ప్రభుత్వ నిర్బంధకాండ అమానుషమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్‌ అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా విజయవాడలో మహా ధర్నా చేస్తున్న అంగన్‌ వాడీలను ప్రభుత్వం అక్రమ అరెస్ట్‌లు చేయడాన్ని నిరసిస్తూ అమలాపురంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కదం తొక్కారు. అంగన్‌వాడీ నిరసన కార్యక్రమంలో దుర్గాప్రసాద్‌ మాట్లాడారు. విజయవాడలో అక్రమంగా అరెస్ట్‌ చేసిన అంగన్‌వాడీలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో అవలంబిస్తున్న సాచివేత వైఖరిని ప్రశ్నిస్తే అన్యాయంగా అరెస్ట్‌ చేస్తారా.? అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్‌వాడీలు నినాదాలు చేశారు. తొలుత అమలాపురం ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ ముఖద్వారం నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా స్థానిక గడియారం స్తంభం సెంటరు వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆ సెంటరులో ధర్నా, మానవ హారం నిర్వహించారు. ఎన్నికల్లో అంగన్‌వాడీలకు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అణచివేత ధోరణిలో అంగన్‌వాడీలను అడ్డుకోవడం, అక్రమ అరెస్ట్‌లు చేయడం ప్రభుత్వానికి తగదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారెం వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అంగన్‌వాడీల జిల్లా యూనియన్‌ కోశాధికారి పి.అమూల్య మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చెప్పే మహిళా సాధికారిత ఇదేనా? అని ప్రశ్నించారు. ఐసీడీఎస్‌ను ప్రారంభించి 50 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు అంగన్‌ వాడీలను కార్మికులుగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2026–27కు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అంగన్‌వాడీలకు కేటాయించిన నిధులు కూడా అరకొరగా ఉండి అన్యాయం జరిగిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వీరి ధర్నా, నిరసన ప్రదర్శన, మానవ హారానికి పలు సంఘాల ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. అమలాపురం ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని వందలాది అంగన్‌వాడీలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ అంగన్‌వాడీల యూనియన్‌ అధ్యక్షురాలు ఎం.విజయ, కార్యదర్శి కె.రత్నకుమారి, యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీ సుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సకిలే సూర్యనారాయణ, అంగన్‌వాడీ యూనియన్‌ ప్రతినిధులు బేబీ గంగారత్నం, జి.దైవకృప, ఎ.సీత, భవాని, సీతామహాలక్ష్మి, దుర్గా భవాని, సత్యవేణి, చంద్రకళ ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అమలాపురంలో

అంగన్‌వాడీల మానవ హారం

విజయవాడలో చేసిన

అరెస్ట్‌లకు నిరసనగా ప్రదర్శన

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement