మోసం, చోరీ.. పక్కా ప్లానింగ్‌

Cheating Case File On Aftab Gold Robbery - Sakshi

తొలుత ఇన్‌స్టాల్‌మెంట్‌లో వస్తువుల విక్రయం

సాక్షి, సిటీబ్యూరో: వివిధ రకాలైన బహుమతుల పేర్లతో ఫోన్లు చేయడం... పన్నులు చెల్లించాలంటూ బ్యాంకు ఖాతాల్లో డబ్బు డిపాజిట్‌ చేయించుకోవడం.. ఇలా అందినకాడికి దండుకుని మోసం చేయడం. ఈ తరహా కేసుల్ని ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నాం. అయితే పూల్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన ఆఫ్తాబ్‌ అహ్మద్‌ షేక్‌ కొత్త పంథాలో మోసాలు చేశాడు. కేవలం ఏడు నెలల కాలంలో 14 నేరాలు చేసిన ఇతగాడిని దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. ఇతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడానికి ప్రయత్నిస్తామని కొత్వాల్‌ అంజనీకుమార్‌ తెలిపారు. అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.   

కొల్హాపూర్‌ జైల్లో నేరగాళ్లతో పెరిగిన పరిచయం 
పూల్‌బాగ్‌ ఆఫ్తాబ్‌ అహ్మద్‌ షేక్‌ వృత్తిరీత్యా కారు డ్రైవర్‌. ప్రస్తుతం పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. 2010లో మహారాష్ట్రలోని సియోన్‌లో ఉన్న అత్తవారింటికి వెళ్ళిన ఇతగాడు అక్కడే తన భార్యసోదరిపై అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పన్వేల్‌ పోలీసులు ఆఫ్తాబ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. న్యాయస్థానం ఇతడికి ఐదున్నరేళ్ళ జైలు శిక్ష విధించడంతో కొల్హాపూర్‌ సెంట్రల్‌ జైలులో గడిపాడు. ఆ సమయంలోనే జైల్లో ఉన్న నేరగాళ్ళతో పరిచయం పెంచుకున్న ఆఫ్తాబ్‌ వివిధ రకాలైన మోసాలు చేయడం నేర్చుకున్నాడు. శిక్షాకాలం ముగియడంతో 2006 సెప్టెంబర్‌లో జైలు నుంచి విడుదలయ్యాడు. నేరుగా నగరానికి చేరుకున్న ఆఫ్తాబ్‌ కొత్త పంథాలో గిఫ్ట్‌లంటూ బురిడీ కొట్టించడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఇతడిపై 23 కేసులు నమోదయ్యాయి. ఆఖరుసారిగా ఈ ఏడాది జనవరిలో అరెస్టయిన ఇతగాడు ఏప్రిల్‌లో జైలు నుంచి బయటకు వచ్చాడు. అప్పటి నుంచి వరుసగా 14 నేరాలు చేశాడు.  

నేరుగా వెళ్ళి అదును చూసుకుని... 
ఇతగాడు గ్రామాల్లో తిరుగుతూ ఇన్‌స్టాల్‌మెంట్‌పై గృహోపకరణాలు విక్రయిస్తూ ఉంటాడు. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్, నిర్మల్, సిద్దిపేట జిల్లాలు, మహారాష్ట్రలోనూ ఇలా చేశాడు. అలా కొందరు మహిళా కస్టమర్లను ఎంపిక చేసుకుంటాడు. మళ్ళీ వారి వద్దకు వెళ్ళే ఆఫ్తాబ్‌ తమ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో మీకు బంపర్‌ బహుమతి వచ్చిందని నమ్మించేవాడు. ఇలా బాధితుల్ని తన వాహనంపైనే సమీపంలో ఉన్న తమ కార్యాలయానికి అంటూ తీసుకువెళ్ళేవాడు. కొద్దిదూరం వెళ్ళిన తర్వాత ఇది కేవలం పేదలకు ఉద్దేశించిన ‘స్కీమ్‌’ అని, మెడలో బంగారం ఉంటే ఇవ్వరని చెప్తాడు. వాళ్ళు తన మెడలో ఉన్న బంగారు ఆభరణాలను తీసి అతడికి ఇచ్చేవారు. ఆపై దృష్టి మళ్ళించి వాటితో ఉడాయించేవాడు. కొన్ని సందర్భాల్లో ఇంటి వద్దే వారికి ఇలా చెప్పేవాడు. దీంతో వాళ్ళు తమ ఆభరణాలు ఇంట్లోనే వదిలి వచ్చేవాళ్ళు. కొద్దిదూరం వెళ్ళిన తర్వాత వారి దృష్టి మళ్ళించి వెనక్కు వచ్చే ఆఫ్తాబ్‌ కుటుంబీకుల్ని బురిడీ కొట్టించి ఆ బంగారంతో ఉడాయించేవాడు.  

ఏడు నెలలు... 11 నేరాలు... 
ఈ నేరాలు చేయడం కోసం ఆఫ్తాబ్‌కు ఓ వాహనం అవసరమైంది. దీనికోసం అతడు మహారాష్ట్రలోని ఖాండ్వా ప్రాంతంలో దాన్ని తస్కరించాడు. దీనిపైనే వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ  మహిళల్ని ఎంపిక చేసుకుని నేరాలు చేశాడు. ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు 14 నేరాలు చేశాడు. నగరంలోని చారి్మనార్‌తో పాటు ఇతర జిల్లాలు, మహారాష్ట్రల్లో పంజా విసిరాడు. వరుసగా నేరాలు జరగడంతో ఆయా ప్రాంతాలకు చెందిన అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. చార్మినార్‌లో నమోదైన కేసును దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ దర్యాప్తు చేసింది. ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.శ్రీశైలం, వి.నరేందర్, మ«హ్మద్‌ థకియుద్దీన్‌లతో కూడిన  బృందం సీసీ కెమెరాలపై దృష్టి పెట్టింది. నేరం జరిగిన ప్రాంతాలతో పాటు ఇతర చోట్ల అధ్యయనం చేసి అనుమానితుడి ఫొటో సేకరించింది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన అధికారులు శుక్రవారం ఆఫ్తాబ్‌ను అరెస్టు చేసింది. ఇతడి నుంచి వాహనం, బంగారంతో కలిసి రూ.18.5 లక్షలు సొత్తు స్వాదీనం చేసుకున్నారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top