
సాక్షి,హైదరాబాద్: చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది. చదువు ఎలా బతకాలో నేర్పిస్తుంది. చక్కటి చదువు మంచి నడవడికను నేర్పిస్తుంది. కానీ ఆ యువతి విషయంలో చదివే మరణ శాసనం రాసింది. అవును స్నేహితుల వేధింపులే ఆమెకు శాపంగా మారాయి. బాగా చదవడం లేదంటూ చేసిన ఏగతాళి మాటలు ఆమెను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. తోటి స్నేహితురాలని చూడకుండా మాటలతో వేధించారు. ప్రాణం తీశారు.
పైన ఫొటోలో కనిపిస్తున్న ఆ యువతి పేరు నిత్య. ఉండేది జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్‌లో. తన తోటి స్నేహితులు తనని ఎగతాళి చేశారని ఆత్మహత్య చేసుకుంది.. నిత్య హైదరాబాద్‌లోని ఓ ఉమెన్స్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న నిత్యాను తోటి స్నేహితురాళ్లే సూటిపోటి మాటలతో వేధించారు. స్నేహితుల ఎగతాళితో మనస్థాపం చెందిన నిత్య హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన జాబితాపూర్‌కు వచ్చింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన స్థానికులు జగిత్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చదువుల కోసం హైదరాబాద్‌కు పంపిస్తే స్నేహితులే వేధించి చంపేశారంటూ నిత్య కుటుంబసభ్యులు కన్నీరు మన్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరో ఏదో అన్నారని క్షణికావేశంలో పెద్ద నిర్ణయం తీసుకున్న నిత్య తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిచ్చింది.