breaking news
betech students
-
ప్రాణం తీసుకున్న బీటెక్ విద్యార్థిని.. కారణం ఆమె స్నేహితులే!
సాక్షి,హైదరాబాద్: చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది. చదువు ఎలా బతకాలో నేర్పిస్తుంది. చక్కటి చదువు మంచి నడవడికను నేర్పిస్తుంది. కానీ ఆ యువతి విషయంలో చదివే మరణ శాసనం రాసింది. అవును స్నేహితుల వేధింపులే ఆమెకు శాపంగా మారాయి. బాగా చదవడం లేదంటూ చేసిన ఏగతాళి మాటలు ఆమెను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. తోటి స్నేహితురాలని చూడకుండా మాటలతో వేధించారు. ప్రాణం తీశారు.పైన ఫొటోలో కనిపిస్తున్న ఆ యువతి పేరు నిత్య. ఉండేది జగిత్యాల జిల్లా రూరల్ మండలం జాబితాపూర్‌లో. తన తోటి స్నేహితులు తనని ఎగతాళి చేశారని ఆత్మహత్య చేసుకుంది.. నిత్య హైదరాబాద్‌లోని ఓ ఉమెన్స్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్న నిత్యాను తోటి స్నేహితురాళ్లే సూటిపోటి మాటలతో వేధించారు. స్నేహితుల ఎగతాళితో మనస్థాపం చెందిన నిత్య హైదరాబాద్ నుంచి తన స్వగ్రామమైన జాబితాపూర్‌కు వచ్చింది.ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన స్థానికులు జగిత్యాల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. చదువుల కోసం హైదరాబాద్‌కు పంపిస్తే స్నేహితులే వేధించి చంపేశారంటూ నిత్య కుటుంబసభ్యులు కన్నీరు మన్నీరవుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరో ఏదో అన్నారని క్షణికావేశంలో పెద్ద నిర్ణయం తీసుకున్న నిత్య తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిచ్చింది. -
పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదే మరీ!
సాక్షి, హైదరాబాద్ : అతని వయసు 11 ఏళ్లు. ఏడో తరగతి చదువుతున్నాడు. అయితే మాకేంటి అనుకుంటున్నారా? మాములోడు అయితే మనకు అవసరం లేదు. కానీ ఈ బాలుడు సమ్‌థింగ్ స్పెషల్. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఇతనికి కరెక్ట్‌గా సెట్ అవుతుంది. స్కూల్ వెళ్లి పాఠాలు వినాల్సిన వయసులో ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠాలు చెబుతూ అందరినీ ఆశ్చర్యాని గురిచేస్తున్నాడు. హైదరాబాద్‌కి చెందిన మహ్మద్ హసన్ అలీ(11) ఏడో తరగతి చదువుతున్నాడు. అందరిలాగే తను కూడా పాఠశాలకు వెళ్తాడు. అందరితో కలిసి ఆటలు ఆడుతాడు. చదువుతాడు. కానీ సాయంత్రం 6 గంటలకు మాత్రం లెక్చరర్ అవతారం ఎత్తి బీటెక్ విద్యార్థులకు పాఠాలు చెబుతాడు. అతని కంటే రెండింతల ఎక్కువ వయసులో గల వారికి పాఠాలు భోదిస్తాడు. అతని దగ్గర కోచింగ్ తీసుకున్న విద్యార్థులు కూడా మా బుల్లి మాస్టార్ చాలా గ్రేట్ అని చెబుతున్నారు. అతడు చెప్పే విధానం కూడా ఈజీగా, అందరికి అర్ధమయ్యేలా ఉంటుందంటున్నారు. అయితే ఇలాంటి ఐడియా, ఇంత మేధాశక్తి ఎలా వచ్చిందని ఈ బుల్లి మాస్టారుని అడిగితే.. తెలుసుకోవాలనే తపనతో నేర్చుకుంటూ ఇతరులకి నేర్పిస్తున్నాను అని చెప్పాడు. ‘ నేను ఇంటర్నెట్లో ఓ వీడియో చూశాను. భారతీయులు ఇతర దేశాలకి వలస వెళ్లి కష్టమైన పనులు చేస్తున్నారు. పెద్ద చదువులు చదివిన వారు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మన దగ్గర లక్షల మంది ఇంజనీరింగ్ చేస్తున్నప్పటికి వారికి ఉద్యోగాలు రావడంలేదు. వారికి టెక్నికల్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్లే విదేశాల్లో ఉద్యోగాలు రావడం లేదని అర్ధమైంది. దీంతో నా దృష్టి డిజైనింగ్ వైపు మళ్లింది. అప్పటి నుంచి నేర్చుకోవడం, నేర్చుకున్నది బోధించడం మొదలు పెట్టాను. గత ఏడాది నుంచి పాఠాలు చెబుతున్నాను. ప్రతి రోజు ఉదయం స్కూల్‌కి వెళ్తాను. 3 గంటలకు ఇంటికి వస్తాను. హోంవర్క్ పూర్తి చేసుకుంటాను. కాసేపు ఆడుకుంటాను. సాయంత్రం కోచింగ్ సెంటర్‌కి వెళ్లి సివిల్, మెకానికల్, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు పాఠాలు చెబుతాను. 2020నాటికి 1000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు బోధించడమే నా లక్ష్యం’ అని ఆ బాలుడు చెబుతున్నాడు. నిజంగా ఈ బుడతడి ఆలోచనకి, మేధాశక్తికి వావ్.. అనాల్సిందే. -
కారు-లారీ ఢీ: ఒకరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
చేవెళ్ల రూరల్(రంగారెడ్డి జిల్లా): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల రూరల్ మండలం దామరగిద్ద గ్రామ శివారులో ఆదివారం ఉదయం కారు-లారీ ఢీకొన్న సంఘటనలో శివాని(25) అనే యువతి మృతిచెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన నలుగురు బీటెక్ విద్యార్థులు వికారాబాద్ నుంచి కారులో హైదరాబాద్ వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. కారు అతివేగంగా వస్తూ అదుపు తప్పి లారీని ఢీకొందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. క్షతగాత్రులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.