రేవ్‌ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు | Sakshi
Sakshi News home page

రేవ్‌ పార్టీ వ్యవహారంలో పలువురికి నోటీసులు

Published Sun, May 26 2024 3:02 AM

Bengaluru rave party: Police issue notice to Telugu actress

మొత్తం 86 మందికి నోటీసులు  

యశవంతపుర: బెంగళూరు శివార్లలోని జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఈ నెల 19న జరిగిన రేవ్‌ పార్టీలో పాల్గొన్నవారిని సోమవారం విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ప్రముఖ తెలుగు సినీ నటి హేమ సహా పలువురికి నోటీసులు ఇచ్చారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్నవారి రక్త నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా 86 మంది డ్రగ్స్‌ సేవించినట్లు తేలింది. వీరిలో పలువురు తెలుగు, కన్నడ సినీ నటీనటులు, ఇంజనీర్లు, తదితరులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో తెలుగు నటి హేమతో పాటు 86 మందికీ బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసి మే 27న విచారణకు హాజరు కావాలని తెలిపారు. ఈ నెల 19న వాసు అనే వ్యక్తి పుట్టిన రోజు పేరుతో ‘సన్‌సెట్‌ టు సన్‌రైజ్‌ విక్టరీ’ పేరుతో రేవ్‌ పార్టీని నిర్వహించాడు. ఇందులో 100 మందికి పైగా పాల్గొన్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దాడి చేయగా ఎండీఎంఎం మాత్రలు, కొకైన్, హైడ్రో గంజాయి లభించాయి. 

ఐదుగురి బ్యాంకు ఖాతాలు సీజ్‌ 
రేవ్‌ పార్టీని ఏర్పాటు చేసిన వాసు, అరుణ్‌కుమార్, నాగబాబు, రణధీర్‌బాబు, మహ్మద్‌ అబూబక్కర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. తాను హైదరాబాద్‌లో ఉన్నానని, పార్టీలో లేనని హేమ పలు వీడియోల ద్వారా బుకాయించినా పోలీసులు అన్ని ఆధారాలు చూపించి విచారణకు రావాలని ఆదేశించారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన ఐదుగురి బ్యాంకు ఖాతాల్లో రూ.లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఖాతాలను సీజ్‌ చేయాలని నిర్ణయించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement