
ప్రతీకాత్మక చిత్రం
కత్తులు, గాజు సీసాలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. వారిలో ఒకరు 'మారో సబ్కో!' అంటూ అరిచాడు...
ముంబై: మహారాష్ట్రలోని బాంద్రాలో జరిగిన ఘర్షణ స్థానికులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటనలో ఆరుగరు తీవ్రంగా గాయపడ్డారు. హత్యాయత్నం, అల్లర్ల కేసులో దాడికి పాల్పడిన 19 మందిని బాంద్రా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాగా, ఇది పాత కక్షలకు సంబంధించిన కేసుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఓ వర్గంపై దాడి చేయడానికి వచ్చిన నిందితులు.. మరో వర్గం వారిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా గాయపడిన వారిలో షేక్, ఆరిఫ్ షేక్, రఫిక్ ఖురేషి, ఉస్మాన్ షేక్, రియాజ్ షేక్, అజాజ్ సయ్యద్ ఉన్నారు. బాధితులను భాభా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇది ప్రణాళిక ప్రకారమే...
ఈ ఘటనపై బాధితుడు ఇర్షాద్ షేక్ మాట్లాడుతూ.. ‘‘నేను, బాంద్రాలోని జేజే కాలనీకి చెందిన మరికొంత మంది నివాసితులు లాల్మిట్టి వంతెన దగ్గర మాట్లాడుకోవడానికి కలిశాం. ఆ సమయంలో దాదాపు 20-25 మంది వ్యక్తులు మోటార్‌సైకిళ్లపై వచ్చి మమ్మల్ని దూషించడం ప్రారంభించారు. అంతేకాకుండా మాపై కత్తులు, గాజు సీసాలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. వారిలో ఒకరు 'మారో సబ్కో!' అంటూ అరిచాడు. ఇది ఓ ప్రణాళిక ప్రకారమే జరిగిన దాడి.’’ అని షేక్ పోలీసులకు తెలిపారు. కాగా, ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సీనియర్ పోలీసు అధికారులకు స్థానిక నివాసితులు, బీజేపీ నాయకుడు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రాంభించినట్లు బాంద్రా సీనియర్ పోలీసు అధికారి నిఖిల్ కాప్సే అన్నారు.