సాక్షి, వరంగల్: నా భర్త నాకు కావాలి. అది కుదరకుంటే అతను బతికి ఉండడానికి వీల్లేదు.. అంటూ వరంగల్ చౌరస్తాలో ఓ వివాహిత కత్తితో కాసేపు హల్ చల్ చేసింది. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగగా.. పోలీసులు రంగంలోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
బుధవారం వరంగల్ చౌరస్తాలో జ్యోత్స్న అనే వివాహిత తన భర్తపై దాడికి యత్నించింది. తప్పించుకున్న భర్త స్థానికంగా ఓ నగల దుకాణంలో దాక్కున్నాడు. అయితే.. ఎలాగైనా చంపుతానంటూ ఆమె రోడ్డు మీదే బైఠాయించింది. దీంతో ఆ భర్త ప్రాణభయంతో పోలీసులకు ఫోన్ చేశాడు.
తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. తన ఆస్తులన్నింటినీ లాగేసుకున్నాడని.. ఇప్పుడు విడాకులు ఇచ్చేందుకు చూస్తున్నాడని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేసిందామె. కోర్టులో కేసు నడుస్తున్నందున.. చంపాలనుకున్నట్లు చెప్పింది. అయితే ఈలోపు రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆమె చేతి నుంచి కత్తి లాక్కుని పీఎస్‌కు తీసుకెళ్లారు.


